రాష్ట్రంలో 21 దేశాల పోలీసు అధికారులు

28 Feb, 2015 05:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాలపై అధ్యయనంలో భాగంగా 21 దేశాల పోలీసు అధికారుల బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. 12 వారాల శిక్షణలో పాల్గొనేందుకు ఈ అధికారుల బృందం ఇటీవల ఢిల్లీలోని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోకు చేరింది. శిక్షణలో భాగంగా ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు విభాగాలు, సంస్థలను సందర్శించి పనితీరును పరిశీలించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీతోపాటు డీజీపీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో సమావేశమైంది.

స్టేట్ క్రైం రికార్డ్స్ బ్యూరో, ఫింగర్ ప్రింట్ బ్యూరో, గ్రేహౌండ్స్ తదితరాల పనితీరును డీజీపీ ఈ బృందానికి తెలియజేశారు. ఐటీ ఆధారిత పోలీసు పౌర సేవలైన ఈ-కాప్స్, పోలీసు ఫేస్ బుక్, జీపీఎస్, క్రైం మ్యాపింగ్, మహిళల భద్రత కోసం హాక్-ఐ తదితర కార్యక్రమాలపై ఈ బృందానికి అవగాహన కల్పించారు. ఈ బృందంలో బోత్స్వాన, ఇథోపియా, ఫిజి, ఘనా, ఇండోనేషియా, గినియా బిస్సావు, కెన్యా, మారిషస్, మయన్మార్, నేపాల్, ఫిలిప్పీన్స్, ట్రినిడాడ్, టుబాగో, ఉగాండా, వియత్నాం, జాంబియా, ఈఐ-సాల్వెడర్, బోస్నియా-హెర్జోగోవినా తదితర దేశాలకు చెందిన 47 మంది యువ పోలీసు అధికారులున్నారు.  
 

మరిన్ని వార్తలు