కోటన్న.. ఓటు ముచ్చట

10 Apr, 2017 12:35 IST|Sakshi
కోటన్న.. ఓటు ముచ్చట

‘కొడుకా కోటేశు! జెప్పన తినిపో.. గీ ఓట్లొల్ల కాడికి పోయత్త’ దబ్బున ఉరికింది ఎల్లవ్వ. ఎప్పుడు ఇల్లు దాటి ఎల్లని అవ్వను సూసి కోటన్న జెరంత పరెషానైండు. గీడు పదో తర గతి పోరడే. కానీ అన్ని ముచ్చట్లు కుల్లకుల్ల ఎరికెతైనే పానం తిరంబడ్తడు. ‘సైకిలెక్కి నువ్వె పోంగ ఓ కోటేశు’ అని పదం అందుకొని రువ్విడితోని సైకిల్ మీద బడికోవట్టె. గింతల్నె జెండల్.. అట్టలు వట్టుకొని అడ్డమచ్చిండో లీడరు లింగన్న. ‘వారీ.. మీ గల్లీల పోలీసోళ్లున్నరా?’అడిగిండు. ‘లేరు. దేనికి’ మాట పూర్తయ్యేలోపే పైసల సంచి వట్టుకొని ‘పంచుదాం రండ్రిరో’ అన్కుంటు దన్నదన్నపోయిండ్లు.
 
 ‘ప్రజాస్వామ్యం- ఓటరు పాత్ర’ పాఠం ఎప్పట్లెక్కనే పదం పాడినట్టె సక్కగా జెప్తాండు సారు. బడైపోయి ఇంటికత్తున్న కోటేశ్‌కు ఏం సమజైతలేదు. గింతల్నే.. ‘మా పెసైల్ ఇత్తె పోతం ఎండైతంది.. ’అని గడబిడజేత్తార్రు ఆడోళ్లు. మల్లిగాడైతే పగటీలే తప్పసీస పట్టుకుని ముప్పై అంకర్లు తిరుక్కుంటా ‘ఓట్రేద్దా.. ఓట్రేద్దాం’ అనవట్టె. ఇంటికచ్చిన కోటన్న కు కోటి జవాబులు గావాలిప్పుడు. గప్పు డే మూడొందలు బొడ్ల సంచిల సదరుకుంట ఎల్లవ్వచ్చింది. ‘అవ్వ గిదేందే.. అం దరి తాన పైసల్ ఉంటాన్నయి.. సెట్టేమన్న పెట్టిండ్లా?’ కోటేశు అడుగంగనే తల్లి నవ్వింది. ‘ఎలచ్చన్ బిడ్డా. గిప్పుడు గాకపోతే ఇంకెప్పుడిత్తరు. సచ్చినోని పెండ్లికి అచ్చిందే కట్నం’ ముచ్చట కుల్లం జేసి గిన్నెలు ముందేస్కుంది తోమెతందుకు.


 గింతల్నే కోటేశ్ మామ కొండయ్య దిగిండు. సింగరేణిల నౌకరిజేత్తడు. ‘మామ గాంధీ తాతేమో గ్రామస్వరాజ్యం అన్నడని సారు పాఠం చెప్పిండు. ఈడనేమో పైసల్ సల్లుతాండ్రు.. తాత జెప్పింది గిదేనా?’ సూటిగడిగిండు. ‘వారీ.. పైసున్నోన్దే రాజ్యం. గిప్పుడు అంగి అంగి దండం పెడ్తరు. అటెన్క సున్నం పెడ్తరు. సున్నమైతె తప్పది. గీ దండం.. పైసా.. మందు అచ్చినప్పుడు తాగి మజా జేయాల్రా’ ఎల్లవ్వలెక్కనే జెప్పి లీడరిచ్చిన కోటరు కచ్చగొట్టిండు. ‘మంకన్నకే మన ఓటు’ అనుకుంట బిర్యాణి పొట్లంతోని ఇంట్ల దిగిండ్లు అక్కా అంజవ్వ. బావ భద్రయ్య. గీ లెక్కలున్నోళ్లను ఏం అడుగాలన్పియ్యలె కోటన్నకు.

 

ఒక్కోడే సిన్నవోయి చెట్టు కింద కూకున్నడు. ‘కోటీ! ఏమైందిరా గట్లున్నవ్’ బండాపిండు శంకరయ్య సారు. కడుపుల బాధంత కక్కిండు కోటన్న. ‘పిచ్చోడా! ఆదర్శాలు మాటలకే. చేతల్లో చూపేటోళ్లు గొప్పోళ్లు. ఆళ్లంతా పోయిండ్లు. తెల్లారింది.. పొద్దుగూకింది.. గంతే జనాల దిమాక్. గియ్యాల అడగకుంటనే ఐదందలిచ్చి.. రేపు యాబై వేలు తింటరు లీడర్లు’ సార్‌కు కోటన్న అడ్డం పడి.. ‘గాయింత సోయి లేకపోతె ఎట్లసార్’ గట్టిగనే అడిగిండు. ‘ఆళ్లకు తెల్సురా తింటరని.

 

కానీ ఓట్లు పడేదాక జనాన్ని పైసకు, మందుకు తిప్పుట్ల లీడర్లు షాన్‌గాళ్లు’ ‘ఆళ్లాడిత్తే గీళ్లు సర్కస్ ఆడుతరా?’ ‘ఆళ్లు నీ లెక్క సదువుకున్నోళ్లు కాదురా అని ఎల్లిపోయిండు శంకరయ్య. ‘సదువు లేని జనాన్ని గొర్రెల కంటే ఈనం జేత్తాండ్లు.. పుస్తకాలల్ల నీతి కథలు, నైతికత అంటరు. అయ్యవ్వ సుత నీతి నిజాయితి గురించి చెప్పిండ్లు. మరి గీ ఓట్లల్ల గవ్వేం లేకపాయె. మా ఇంటోళ్లు సుత పెసైలే తీస్కోవట్టిరి’ గొణుగుతున్న కోటన్నకు యాన్నో లొల్లి ఇనవడ్డది. ఓటర్లుగా దిగజారొద్దు’ ఒక్క రోజు బాగోతం.. ఐదేండ్లు బానిసత్వం’ అనుకుంట ర్యాలీ పోతాంది. పాణం గొట్టుకొని ఆ గుంపుల కల్సిండు కోటన్న. ‘గొప్ప లీడరు తయారైతున్నడు’ కోటన్నను సూసి మళ్ల బండి చాల్‌జే సిండు శంకరయ్యసారు.  
 

మరిన్ని వార్తలు