నామినేషన్లు ఉపసంహరిస్తే ఆఫర్లు..

13 Jan, 2020 09:41 IST|Sakshi

రెబల్స్‌ బెడద లేకుండా ప్రయత్నాలు

రాజీ కుదిర్చేందుకు రంగంలోకి నేతలు

మాట వినకపోతే వేటే

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోనే అధికంగా నామినేషన్లు

సాక్షి, జనగామ: మున్సిపల్‌ నామినేషన్ల ఉపసంహరణలకు రేపటితో గడువు ముగుస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు బుజ్జగింపులకు శ్రీకారం చుట్టాయి. పార్టీ తరఫున ఒక్కరే బరిలో ఉండే విధంగా ఇతరులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబల్స్‌ బెడద లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. 

రాజీ కుదిర్చే పనిలో నాయకులు..
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 268 మంది అభ్యర్థులు 413 నామినేషన్లను దాఖలు చేశారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నుంచి 167 మంది నామినేషన్లు దాఖలుచేయగా కాంగ్రెస్‌ నుంచి 111, బీజేపీ నుంచి 52 నామినేషన్లు వేశారు. ప్రతీ వార్డులోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ అదే తరహాలో పోటీకి అభ్యర్థులు క్యూ కట్టారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలో ఒక్కో వార్డుల్లో సగటున ముగ్గురు, నాలుగు నామినేషన్‌ వేశారు. నామినేషన్ల వేసిన వారిని సముదాయించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. నామినేషన్‌ వేసిన అభ్యర్థులతో నేరుగా సంప్రదింపులు చేస్తూ రాజీ కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఆఫర్లు..ఖర్చులు..
వార్డుల్లో వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీలో కో ఆప్షన్, మార్కెట్‌ డైరెక్టర్లు, ఇతర నామినేటేడ్‌ పదవులతోపాటు పార్టీ పదవులను ఆఫర్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ ఎక్కువ మంది పోటీ లేకుండా చూడడానికి మంతనాలు సాగిస్తున్నారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవడానికి బేరసారాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోటీలో ఒక్కరే ఉండే విధంగా చర్చలు జరుపుతున్నారు.

మాట వినకపోతే వేటే..
బుజ్జగింపులతో తమ దారిలోకి రాకపోతే చివరి ప్రయత్నంగా వేటు వేయాలని పార్టీల నేతలు భావిస్తున్నారు. వార్డుల్లో రెబల్స్‌ బెడద లేకుండా చేయడానికి పార్టీ నుంచి బహిష్కరించనున్నట్లు తేల్చి చెబుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలోని రెబల్స్‌ను కట్టడి చేయడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు.

బీ ఫాంల పంపిణీపై ఉత్కంఠ..
ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక నాయకులకు కత్తిమీద సాములా మారింది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలనేది తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నిర్ణీత గడువులోగా అభ్యర్థులకు బీ ఫాంలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీ ఫాంలు ఎవరికి దక్కుతాయనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఒకరిని చూసి మరో పార్టీ అభ్యర్థులను ప్రకటించడం లేదు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే టికెట్‌ దక్కని వారు పార్టీ మారే అవకాశాలుండడంతో గోప్యం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా చివరి రోజునే నేరుగా బీ ఫాంలను ఎన్నికల అధికారులకు అందించే పరిస్థితి నెలకొన్నది.
 

మరిన్ని వార్తలు