త్వరలో అధిక దిగుబడులిచ్చే సజ్జ

19 Sep, 2017 03:06 IST|Sakshi
త్వరలో అధిక దిగుబడులిచ్చే సజ్జ
- ఇక్రిశాట్‌ నేతృత్వంలో జన్యు పరిశోధనలు..
కీలక జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు
 
సాక్షి, హైదరాబాద్‌: అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూనే అధిక దిగుబడులిచ్చే సజ్జ వంగడాల సృష్టికి మార్గం సుగమమైంది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సజ్జ మొక్కల జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా ఈ కీలక విజయాన్ని సాధించింది. సజ్జలు అతి తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలవు. సాగుకయ్యే ఖర్చు కూడా తక్కువ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది చిన్న, సన్నకారు రైతులు సజ్జ పంటను సాగుచేస్తున్నారు.

అయితే వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. దీనివల్ల ఇతర పంటల మాదిరిగానే సజ్జల దిగుబడులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌తోపాటు చైనాలోని బీజీఐ షెన్‌జెన్, ఫ్రెంచ్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ తదితర పరిశోధన సంస్థలు సజ్జపై పరిశోధనలు చేపట్టాయి. సజ్జ జన్యుక్రమాన్ని ఆధునిక టెక్నాలజీల ద్వారా విశ్లేషించి మరింత ఎక్కువ వర్షాభావ పరిస్థితులను, 42 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉష్ణోగ్రతలను తట్టుకోగల జన్యువులు, ఇతర మాలిక్యులర్‌ మార్కర్స్‌ను గుర్తించారు.

ఈ క్రమంలోనే సజ్జల ద్వారా మరిన్ని ఎక్కువ పోషకాలు అందించడం ఎలాగో తెలుసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలిగే జన్యువులు, లక్షణాలను గుర్తించడం ద్వారా మెరుగైన దిగుబడులిచ్చే సజ్జ వంగడాల సృష్టి సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజీవ్‌ వార్‌‡్షణీ తెలిపారు. భవిష్యత్తులో ఈ పరిశోధనలను వరి, గోధుమలకూ విస్తరిస్తామని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బెర్గ్‌విన్సన్‌ తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్‌ బయోటెక్నాలజీ మ్యాగజైన్‌ సంచికలో ప్రచురితమయ్యాయి. 
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు