పాతబస్తీలో ఫలించని మంత్రం

12 Apr, 2019 06:45 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే తక్కువ పోలింగ్‌

అత్యల్పంగా 39.49 శాతమే నమోదు

అతి తక్కువగా మహిళల ఓటింగ్‌ శాతం

ఎన్నికల అధికారులు, మజ్లిస్‌ ప్రయత్నాలు వృథా ప్రయాసే

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో పోలింగ్‌ శాతం పెంపుపై ఎన్నికల యంత్రాంగం, ప్రధాన రాజకీయ పక్షాలు చేసిన ప్రయోగం ఫలించలేదు. లోక్‌సభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరుగుతున్న పోలింగ్‌ శాతం మాత్రం పెరగడం లేదు. ఈసారి కొత్తగా నమోదైన యువ ఓటర్లపై ఎన్నికల యంత్రాంగంతో పాటు మజ్లిస్‌ పార్టీ దృష్టి సారించినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా లెర్న్‌ ప్రాజెక్టును ప్రారంభించి కళాశాల విద్యార్ధులతో టాక్‌విత్‌ అసదుద్దీన్‌ పేరుతో ముఖాముఖి, టౌన్‌హాల్‌ కార్యక్రమాలను నిర్వహించింది. పాదయాత్రలతో పోలింగ్‌ శాతం పెంపుపై అవగాహన కూడా కల్పించింది.

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో వన్‌సైడ్‌గా పోలింగ్‌ జరిగే ఆనవాయితీ ఉన్నా.. మెజార్టీకి పోలింగ్‌ శాతమే ప్రాణం. వాస్తవంగా పాతబస్తీ  పరిధిలో విస్తరించి ఉన్న లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్‌ పార్టీకి గట్టి పట్టు ఉంది. మెజార్టీ ఒకే సామాజిక వర్గం కావడంతో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. గుండుగుత్తగా ఓట్లు పడతాయి. సదరు సామాజికవర్గం వారు ఓట్లు వేశారంటే కచ్చితంగా ఆ పార్టీ ఖాతాలో పడినట్లే నమ్మకం. ప్రజలపై విశ్వాసం. కానీ ఈసారి పోలింగ్‌ శాతం గణనీయంగా పడిపోయింది. పాతబస్తీలో పురుష ఓటర్లతో పోల్చితే మహిళా పోలింగ్‌ శాతం తక్కువగా నమోదయ్యింది. సాధారణంగా ఇంటి పనులతో తీరికలేకపోవడం, కట్టుబాట్లు, ఇతరత్రా కారణాలతో  ప్రత్యేక సమయం కేటాయించి బయటకి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. ప్రతిసారీ మహిళా పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం.  

మరిన్ని వార్తలు