జూన్‌ చివర్లో ‘పుర’ పోరు!

7 May, 2019 05:14 IST|Sakshi

కుదరకుంటే జూలై తొలి వారంలో మున్సిపల్‌ ఎన్నికలు

వార్డుల డీలిమిటేషన్‌ కసరత్తు మొదలుపెట్టిన అధికారులు

కొత్త చట్టానికి అనుగుణంగా పునర్విభజన ప్రక్రియ

బీసీ రిజర్వేషన్ల వర్గీకరణలో న్యాయపరమైన చిక్కులు

హైకోర్టులో కేసు పెండింగ్‌...

అది తేలితేనే రిజర్వేషన్లు అమలు

సాక్షి, హైదరాబాద్‌: పురపోరుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. జూన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో పట్టణ, పురపాలకశాఖ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది. ఆలోపే కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని భావించిన కేసీఆర్‌ సర్కారు.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు కార్పొరేషన్లు, 136 మున్సిపాలిటీల్లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట పురపాలక సంఘాలు మినహా మిగతా వాటి పాలకవర్గాల పదవీకాలం జూలై ఒకటితో ముగియనుంది. 

ఈ నెలాఖరుకు ముసాయిదా... 
పురపాలక చట్టం ముసాయిదాపై కుస్తీ పడుతున్న ప్రభుత్వం.. ఈ నెలాఖరుకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు, పురపాలకశాఖ మాజీ డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ), పురపాలక శాఖలు కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసిన యంత్రాంగం.. పౌర సేవలు, పట్టణ ప్రణాళిక, ప్రజాప్రతినిధుల బాధ్యతపై చట్టంలో స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త మున్సిపల్‌ చట్టం తెచ్చాకే పురపోరుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో నయా చట్టానికి ఆమోదముద్ర వేసే దిశగా ఆలోచన చేస్తోంది. నూతన చట్టం మనుగడలోకి వచ్చాక వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖర్లో లేదా జూలై మొదటి వారంలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 

వడివడిగా వార్డుల విభజన! 
వార్డుల పునర్విభజన ప్రక్రియపై పురపాలకశాఖ అంతర్గత కసరత్తును ప్రారంభించింది. ఎన్నికలపై ప్రభుత్వం సంకేతాలివ్వడం, కొత్త చట్టంలో పొందుపరిచే అంశాలపై కూడా స్పష్టత ఉండటంతో దానికి అనుగుణంగా వార్డుల డీలిమిటేషన్‌ను చేపడుతోంది. చట్టానికి ఆమోదముద్ర పడటమే తరువాయి ఎన్నికలకు వెళ్లడానికి అడ్డంకులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత పాటించలేదు. ఒక్కో వార్డులో 1,500 నుంచి 15 వేల వరకు జనాభా వరకు ఉంది. దీంతో తాజా చట్టంలోనూ వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను పొందుపరచనున్నారు. వార్డుల్లోని జనాభా ఒకే తరహాలో ఉండేలా శాస్త్రీయంగా విభజించనున్నారు. అలాగే మున్సిపాలిటీల గ్రేడింగ్‌పైనా స్పష్టత ఇవ్వనున్నారు. గతంలో ఐదు గ్రేడ్‌లుగా మున్సిపాలిటీలను వర్గీకరించారు. సెలక్షన్‌ గ్రేడ్, స్పెషల్‌ గ్రేడ్, గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, గ్రేడ్‌–3 మున్సిపాలిటీలు ఉండేవి. వాటిని గతేడాది మున్సిపల్‌ చట్ట సవరణలో తొలగించగా తాజాగా మళ్లీ గ్రేడింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా మూడు గ్రేడ్లకే పరిమితం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ గ్రేడ్లకు అనుగుణంగా పురపాలికల్లో వార్డుల సంఖ్య ఉండనుంది. 

బీసీల రిజర్వేషన్లే అసలు సమస్య... 
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లలో ప్రధానంగా రెండు సామాజికవర్గాలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయన్న అభిప్రాయంతో మిగిలిన బీసీ వర్గాలు ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు బీసీ రిజర్వేషన్లను అన్ని కులాలవారీగా విభజించి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పును సమర్థించింది. అయినా ఈ రిజర్వేషన్లు అమలు కాలేదంటూ ఇటీవలే మళ్లీ ఆ వర్గాలు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఈ రిజర్వేషన్ల అంశం మరోసారి బయటకు వస్తే ఎన్నికలు మరికొంతకాలం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు