రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత

27 Apr, 2018 10:43 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌

చివరి గింజకూ  మద్దతు ధర

ఆన్‌లైన్‌ అమ్మకాలతో అక్రమాలకు చెక్‌ 

మంత్రి ఈటల రాజేందర్‌ 

పెద్దపల్లిరూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుత సీజన్‌లో రైతులు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి ఈటల, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ గుండేటి ఐలయ్యతో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆరా తీస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం మార్కెట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అద్భుత పథకాలకు రూపకల్పన జరుగుతోందన్నారు. రైతులు పంట సాగుకు పెట్టే పెట్టుబడి మొదలు ఆధునిక వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందిస్తూ.. పంట దిగుబడులు వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర చెల్లించేది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. వరిధాన్యాన్ని ఐకేపీ, సింగిల్‌ విండో కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పొరుగు రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు కొందరు రైస్‌మిల్లర్లు రూ.1620 నుంచి 1650 వరకు ధర చెల్లిస్తామంటూ గ్రామాల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. అలాంటి వ్యాపారులు నాణ్యత సరిగా లేదంటూ తక్కువ ధర చెల్లించే అవకాశం ఉందని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా జరిగే క్రయ విక్రయాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ అక్రమాలను నియంత్రిస్తున్నామన్నారు. అనేక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ అన్నదాత గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడని ఎమ్మెల్యే దాసరి అన్నారు.

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పరితపిస్తున్న కేసీఆర్‌ బంగారు తెలంగాణ సాధించాలన్న ఆశయసాధనకు అందరూ తోడ్పాటునందించాలన్నారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మంత్రి సాయంతో ముందుకు సాగుతామని మార్కెట్‌ చైర్మన్‌ ఐలయ్యయాదవ్‌ అన్నా రు. కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌సింగ్, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మాదారపు ఆంజనేయరావు, డైరెక్టర్లు జడల సురేందర్, రాజేందర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా