బోల్తాకొట్టిన ప్రైవేటు బస్సు.. తప్పిన పెనుప్రమాదం!

9 Jul, 2018 09:05 IST|Sakshi

సాక్షి, నకిరేకల్‌: వేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అయితే, ఈ ఘటనలో త్రుటిలో పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామశివారులో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ సాయికృష్ణ కంపెనీకి చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి తెనాలి వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డుప్రక్కన ఇనుప రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. అయితే, బస్సు స్లీపర్ కోచ్ కావడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే బస్సును రోడ్డు ప్రక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. రైలింగ్‌ను ఢీకొట్టడం వల్ల కొంతమేరకు బస్సు వేగం తగ్గి.. బస్సు రోడ్డుదిగి ఎడమవైపు ఒరిగి.. బస్సు పల్టీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు.

హైదరాబాద్‌ బీహెచ్ఈఎల్ నుంచి ఆదివారం అర్ధరాత్రి రాత్రి 12: 30 గంటలకు బయలుదేరిన బస్సు తెల్లవారుజామున సుమారు రెండుగంటల ప్రాతంలో ప్రమాదానికి గురైంది. బస్సులోని ప్రయాణికులు వెనుక భాగం, ముందుభాగం అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. ప్రయాణికుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 108 వాహనాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సురక్షితంగా ఉన్న ప్రయాణికులను విజయవాడ బస్సుల్లో పంపారు.

మరిన్ని వార్తలు