విద్యార్థులకు ప్రోగ్రెస్‌కార్డులు చేరేదెప్పుడో?

23 Nov, 2018 17:25 IST|Sakshi
పంపిణీ చేయాల్సిన విద్యార్థి ప్రగతి నివేదిక(రికార్డులు) పుస్తకాలు ఇవే 

మంచిర్యాలఅర్బన్‌: విద్యార్థుల ప్రగతి ఎలా ఉందో తెలుసుకోవాలంటే నివేదిక కీలకం. తరగతి గదిలో విద్యార్థి ప్రతిభ, మార్కులు ఎలా వస్తున్నాయో ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రుకు తెలియాలంటే అందించే ప్రగతి నివేదిక పంపిణీలో ఎనలేని జాప్యం జరుగుతోంది. విద్య సంవత్సరం ప్రారంభమై ఐదునెలలు గడుస్తున్నా ప్రగతి నివేదిక పత్రాలు పాఠశాలలకు చేరలేదు. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పే పాలకులు, అధికారులు మాటలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికే రెండు పరీక్షలు ముగిసిన వాటికి సంబంధించిన ప్రగతిని రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంది. ఆలస్యం కారణం ఏమైనా మంచిర్యాల బుక్‌ డిపోకు చేరి వారం గడుస్తున్నా గోదాంలు దాటని వైనంపై ‘సాక్షి’ కథనం.

ప్రగతి నివేదికలు పంపిణీ ఇలా?
విద్యాసంవత్సరం ప్రారంభమైన మొదటో ఏటా ఒకటి, ఆరోతరగతి విద్యార్థులకు ప్రగతి నివేదికల రికార్డులు అందిస్తారు. ప్రగతి నివేదిక ప్రోగ్రెస్‌ రిపోర్టు, సమగ్ర నిరంతర మూల్యంకనం, సెంట్రల్‌ మార్క్‌ రిజిస్టర్లను ప్రభుత్వమే అందిస్తూ వస్తోంది. మిగతా తరగతుల వారికి గతంలో ఇచ్చిన వాటిల్లోనే (రికార్డుల్లోనే) మార్కులు పొందుపరుస్తారు. కానీ ఈ ఏడాది ఐదునెలలు గడిచినా ప్రగతి నివేదికల రికార్డులబుక్‌లు అందకపోవడంతో విద్యార్థుల మార్కులను నోట్‌ పుస్తకాల్లోనే రాసుకోవాల్సిన పరిస్థితి.

పరీక్షలు పూర్తయినా...
ఇప్పటికే ఎఫ్‌ఏ–1, ఎఫ్‌ఏ–2 పరీక్షలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల ప్రగతి నివేదికలను పూర్తి వివరాలతో తల్లిదండ్రులకు పంపించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఉపాధ్యాయులు జవాబుపత్రాలను విద్యార్థులతో ఇంటికి పంపించి వారి తల్లిదండ్రులు చూపించి సంతకం తీసుకురావాలని సూచనలు చేస్తున్న వారు లేకపోలేదు. ప్రస్తుతం కాగితాలు, జవాబుపత్రాలపై ఉన్న మార్కులు మళ్లీ ప్రగతి నివేదికల్లో వేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 

ఐదు నెలలు గడుస్తున్నా...
పాఠశాలలు పున:ప్రారంభమై ఐదునెలులు గడిచిపోయింది. సెంట్రల్‌మార్కు రిజిస్టర్, విద్యార్థి సంచిత సమగ్ర ప్రగతి నివేదిక ( క్యుములేటివ్‌ రికార్డు), సీసీఈ రిజిస్టర్‌ (ప్రగతి నమోదు రిజిస్టర్‌)లు మాత్రం ఇప్పటివరకు పాఠశాలలకు చేరలేదు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాకేంద్రం ప్రభుత్వం పుస్తక విక్రయ కేంద్రం (బుక్‌డిపో)కు చేరి రోజులు గడుస్తున్నా గోదాంల నుంచి దాటడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బుక్‌ డిపోల్లోనే భద్రం..
జిల్లాలోని 18 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసే సీసీఈ ప్రోగ్రెస్‌ రికార్డింగ్‌ రిజిస్ట్రర్లు 173(తెలుగు మీడియం), 14 (ఉర్దూ),7(ఇంగ్లీష్‌) క్యుములేటివ్‌ ప్రోగ్రెస్‌ రికార్డు 764 (తెలుగు మీడియం) 64(ఉర్దూ), సెంట్రల్‌ మార్కు రిజిస్ట్రర్లు–86 (తెలుగు మీడియం) 5(ఉర్దూ), 4 (ఇంగ్లీష్‌ మీడియం) బుక్‌డిపోకు చేరాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అందించేందుకు సీసీఈ ప్రోగ్రెస్‌ రికార్డింగ్‌ రిజిస్టర్లు– 3048(తె.మీ), 505(ఇ.మీ), 116(ఉ.మీ), క్యుములేటివ్‌ ప్రోగ్రెస్‌ రికార్డు 5486(తె.మీ), 3149(ఇ.మీ), 117(ఉ.మీ), సెంట్రల్‌ మార్కు రిజిస్టర్లు 707(తె.మీ),197(ఇ.మీ), 24(ఉ.మీ) సంబంధించిన విద్యార్థి ప్రగతి నివేదిక పుస్తకాలు గోదాంల్లోనే ఉన్నాయి. ఒక్క ఇంగ్లీశ్‌ మీడియానికి చెందిన క్యుములేటివ్‌ ప్రోగ్రెస్‌ రికార్డులకు సంబంధించిన 53 మాత్రమే తక్కువగా వచ్చాయి.
 

రెండురోజుల్లో  పంపిణీ
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ప్రగతి నివేదికలకు సంబంధించిన రికార్డులు బుక్‌డిపోకు చేరాయి. ఏయే పాఠశాలలకు ఎన్ని ఇవ్వాలో నివేదిక తయారు చేశాం. మండల ఎంఈవోలకు సమాచారం పంపించాం. రెండురోజుల్లో మండలాలకు అక్కడి నుంచి పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. – పారుపెల్లి ప్రభాకర్‌రావు,సెక్టోరల్‌ అధికారి మంచిర్యాల   

మరిన్ని వార్తలు