మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

24 Apr, 2019 11:41 IST|Sakshi

ఓపెన్‌ కాని వెబ్‌సైట్‌.. ఆందోళనలో విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌: మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌ గ్రామానికి చెందిన చాకలి రాజు అనే 18 ఏళ్ల విద్యార్థి.. అదే గ్రామంలోని పాఠశాలలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో సీఈసీ గ్రూప్‌లో ఇంటర్‌ చదివిని రాజు...రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత
బేగంపేట సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్‌ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ ప్రయత్నించింది. ప్రగతి భవన్‌ ముట్టడికి తరలివచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇంటర్‌ బోర్డు వైఫల్యంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగో రోజూ ఆందోళనలు
ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు తప్పిదాలపై తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బోర్డ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సైతం రావల్సిన సమయం కంటే ముందుగానే బోర్డుకి చేరుకున్నారు. అయినా, ఆందోళనలు ఆగడం లేదు. మరోవైపు పరీక్షా పత్రాల రీ వాల్యుయేషన్‌, మార్కుల రీకౌంటింగ్‌ గడువు పెంచినప్పటికీ.. విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు.. పెద్దసంఖ్యలో ఇంటర్‌ బోర్డు వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  

ఇంటర్‌ తప్పిదాలు.. విద్యార్థుల బలవన్మరణాలు
ఇంటర్‌ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 18మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలకు మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం తిరుమలాపూర్‌కు చెందిన జ్యోతి..ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. తాజాగా విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో సెకండియర్‌ సివిక్స్‌ పరీక్షలో ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి..ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. కాగా, వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన నవీన్ (నిన్న) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్‌ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యానన్న మనస్తాపంతో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంత జరుగుతున్నా ఇంటర్‌ బోర్డు కళ్లు తెరవడం లేదు. తప్పులు సరిదిద్దుకునే చర్యలు చేపట్టడం లేదు. కళ్లేదుట తప్పులు కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్‌ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్ధుల్లో ధైర్యం నింపాల్సిన అధికారులు కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రేపు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ ధర్నా..
ఇంటర్ పరీక్షల నిర్వహణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల 18 మంది విద్యార్థులు తమ జీవితాలను కోల్పోయారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. విద్యార్థుల పరీక్షాపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు