సూడో డాక్టర్‌ సూపర్‌ నెట్‌వర్క్‌!

30 Jun, 2018 01:36 IST|Sakshi

దేశ వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న సంతోష్‌

‘కోటాల్లో పీజీ మెడికల్‌ సీట్ల’స్కామ్‌ సూత్రధారి ఇతడే

గతంలో కొన్ని బాలీవుడ్‌ సినిమాలనూ నిర్మించిన వైనం

కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు

సాక్షి, హైదరాబాద్‌: ఎంట్రన్స్‌లు అవసరం లేకుండా మెడిసిన్‌ పీజీ సీట్లు ఇప్పిస్తామం టూ బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు ఇచ్చి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఘరానా గ్యాంగ్‌కు సంతోష్‌ కుమార్‌ రాయ్‌ సూత్రధారి అని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. గురువారం పోలీసులు అరెస్టు చేసిన ఇరువురిలో ఇతడూ ఉన్నాడు.

పదిహేనేళ్లుగా సంతోష్‌ ఇదే దందాలో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అతడు పలువురిని బ్లాక్‌మెయిల్‌ కూడా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును లోతుగా విచారించేందుకుగాను వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతి లభిస్తే సంతోష్‌ను ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలకు తీసుకువెళ్లి దర్యాప్తు చేయాల్సి ఉంటుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు.

కేవలం నగదు లావాదేవీలు మాత్రమే
దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఈ గ్యాంగ్‌ ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసిం ది. బ్యాంక్‌ ఖాతాల్లో వేయించుకుంటే పోలీ సులకు ఆధారాలు లభిస్తాయనే ఉద్దేశంతో కేవలం నగదు మాత్రమే తీసుకుంటుంది. దీనికోసం సంతోష్‌ తన అనుచరుల్ని ఏ ప్రాంతా నికి కావాలంటే ఆ ప్రాంతానికి పంపిస్తుంటాడు. కొన్నిసార్లు టార్గెట్‌నే ముంబైకి పిలి పించుకుని వసూలు చేశాడు.

మెడిసిన్‌ పీజీ సీట్లు ఆశించేవారికి నమ్మకం కలగడానికి సం తోష్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌తోపాటు వివిధ యూనివర్సిటీల పేర్లతో కొన్ని డీడీలను సైతం కట్టిస్తాడు. సిటీ కి చెం దిన బాధితురాలు డాక్టర్‌ ఫాతిమా రజ్వీతో నూ రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.16,700 డీడీలు కట్టించాడు. నగదుతోపాటు వీటిని కలెక్ట్‌ చేసుకునే ఈ గ్యాంగ్‌ ఎక్కడా ఎన్‌క్యాష్‌ చేయదు. ఈ గ్యాంగ్‌ సూడో డాక్టర్ల రూపంలో ఢిల్లీలో ఓ ఆస్పత్రిని  నిర్వహించిన విషయం తెలిసిందే. దీన్ని సీజ్‌ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.  

‘ఏరియా’కు ఓ పని అప్పగింత
పోలీసులు దాడి చేసినా ముఠా మొత్తం చిక్కకుండా సంతోష్‌ జాగ్రత్తలు తీసుకున్నాడు. వెబ్‌సైట్లు హ్యాకింగ్‌ చేయడం, అవసరమైతే నకిలీ వెబ్‌సైట్లు సృష్టించడం, స్పూఫింగ్‌కు పాల్పడటం తదితర ‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు ’ బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను ఏర్పాటు చేసుకున్నాడు. నగదు కలెక్ట్‌ చేసుకునే ఏజెంట్లను ఢిల్లీ నుంచి పంపిస్తాడు. బల్క్‌ ఎస్సెమ్మె స్‌లు పంపే వారు వారణాసి కేం ద్రంగా పనిచేస్తారు. సంతోష్‌ తన అనుచరుల్లో కొందరికి జీతాలు, మరికొందరికి కమీషన్లు ఇస్తుంటాడు.  

వివాదాస్పద నిర్మాతగా...
హిందుత్వవాదిగా పేరున్న సం తోష్‌ రాయ్‌ అఖిల భారతీయ హిం దూ మహాసభ సీనియర్‌ లీడర్‌ హోదాలో అనేక జాతీయ చానళ్లలో చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రహ్మర్షి ఫిలింస్‌ పేరుతో ఓ బ్యానర్‌ ఏర్పాటు చేసి కొన్ని బాలీవుడ్‌ చిత్రాలనూ నిర్మించాడు.

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే చరిత్రను 2011లో ‘గాడ్సే’ పేరుతో తెరకెక్కించాడు. ఠాకూర్‌ ప్రజ్ఞాసింగ్‌ సాధ్వీ తదితరుల అరెస్టుతో తెరపైకి వచ్చిన హిం దూ ఉగ్రవాదంపై బాలీ వుడ్‌ దర్శకనిర్మాత సంజయ్‌ లీలా బన్సాలీ ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని గతేడాది భావిం చారు. అలాం టి ప్రయత్నాలు చేస్తే బాలీవుడ్‌లో చిత్ర నిర్మాణం ఆగిపోతుందంటూ హెచ్చరించి వివాదాస్పదుడయ్యాడు.

అతడు బ్రహ్మర్షి ఫిలింస్‌తోపాటు పలు సంస్థలు నెలకొల్పాడు. ఇతడి ‘మెడిసిన్‌’మోసాలపై ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలతోపాటు పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్‌ల్లోనూ   కేసులు నమోదయ్యాయి.   అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ లు, ఐపీఎస్‌లతోపాటు మరికొందరు ప్రముఖుల్నీ బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు.  

మరిన్ని వార్తలు