ప్రజా భాగస్వామ్యంతో నగరాభివృద్ధి

13 Feb, 2016 03:29 IST|Sakshi
ప్రజా భాగస్వామ్యంతో నగరాభివృద్ధి

మీడియాతో జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్
♦ సమస్యలన్నీ తెలుసుకున్నాక భావి కార్యాచరణ
♦ కేసీఆర్ ప్రణాళిక.. కేటీఆర్ డెరైక్షన్‌లో పనిచేస్తాం
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో 50 ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారం ప్రజల భాగస్వామ్యం లేనిదే సాధ్యం కాదని జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ బొంతు రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. నగరవాసులు కాలనీలు, బస్తీలవారీగా సంఘాలుగా ఏర్పడి వాటి పరిష్కారానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాద్ నగర పరిస్థితులపై అధికారులతో సమీక్షించాక తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మేయర్ రామ్మోహన్ చెప్పారు.

సమస్యల స్థాయిని బట్టి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరి సహకారముంటే అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయవచ్చన్నారు. జీహెచ్‌ఎంసీ అమలు చేస్తున్న రూ.5 భోజనం బాగుందని... ప్రస్తుతం 51 కేంద్రాల్లో కొనసాగుతున్న దీనిని 150 కేంద్రాల దాకా పెంచే యోచన ఉందని తెలిపారు. తొలి పని, తొలి సంతకం వంటివి తనకు పట్టవని, ఎప్పుడు ఏది అవసరమైతే అది చేస్తానని రామ్మోహన్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎసీ జనరల్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని పదిహేను, ఇరవై రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 ఎక్కడ తగ్గాలో తెలుసు..
 తెలంగాణ కోసం ఓపికతో వేచి చూసిన తమకు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో తెలుసని రామ్మోహన్ వ్యాఖ్యానించారు. విశ్వనగరానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని.. మంత్రి కేటీఆర్ డెరైక్షన్‌లో వాటి వేగం పెరిగేందుకు తమవంతు కృషి చేస్తామని చెప్పారు. అందుకు ప్రజల భాగస్వామ్యం, సహకారం అవసరమన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి నీళ్లు వచ్చినా... ఇంకా అనేక ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని, వంద రూపాయల కూలీ వచ్చేవారు కూడా నీటి కోసమే రూ.30 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై, ముంబై తదితర నగరాలతో పోలిస్తే మన దగ్గర ట్రాఫిక్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, మరింత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. నగరం చుట్టూ ఏర్పాటు కానున్న 12 మినీ నగరాల (శాటిలైట్ టౌన్‌షిప్స్)తో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందన్నారు.

 కలసి ముందుకు సాగుదాం
 ఉద్యమంలో పనిచేసిన తమకు అతిపెద్ద బాధ్యతలు ఇచ్చారని డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో గల్లీల నుంచి చౌరస్తాల దాకా, పాతబస్తీ నుంచి కొత్త సిటీ దాకా అంతటా సమస్యలు ఉన్నాయని... వాటిని పరిష్కరించేందుకు, అభివృద్ధిపథంలో పయనించేందుకు అందరి సహకారంతో కృషిచే స్తామని చెప్పారు. అందరం కలసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కాగా మీడియాతో మాట్లాడడానికి ముందే బాధ్యతలు చేపట్టిన మేయర్, డిప్యూటీ మేయర్.. జీహెచ్‌ఎంసీ దగ్గరి రూ.5 భోజన కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ భోజనం చేసి, ఇంటి భోజనంలా బాగుందని ప్రశంసించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసానిలలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అభినందించారు.
 
 సామాన్యులకు పెద్ద బాధ్యతలు
 కేసీఆర్, కేటీఆర్‌కు తమ గురించి తెలుసుగనకే ఈ బాధ్యతలు అప్పగించారని రామ్మోహన్ పేర్కొన్నా రు. అతి సామాన్య కార్యకర్తలమైన తమకు పెద్ద నగర పగ్గాలను అప్పగించడం సామాన్య విషయం కాదన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో తమ కూ అవకాశం కల్పించారన్నారు. ఒక్కరాత్రిలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే భ్రమ లు కానీ, అలాంటి విధానాలుగానీ తమకు లేవన్నారు.

మరిన్ని వార్తలు