బాలింత మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలి

27 Dec, 2014 02:33 IST|Sakshi

జగిత్యాల : బాలింత మృతికి కారణమైన రాయికల్ పీహెచ్‌సీ వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు శుక్రవారం జగిత్యాల తహశీల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్ మండలం వేంపల్లివెంకట్రావ్‌పేటకు చెందిన మోత్కుల విజయ(20)ను తొలికాన్పు కోసం కుటుంబసభ్యులు రాయికల్ పీహెచ్‌సీలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచగా, గురువారం సాయంత్రం నొప్పులు రావడంతో అపరేషన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్రరక్తస్రావం కాగా, జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా విజయ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన బంధువులు వెంటనే రాయికల్ ఆసుపత్రిపై దాడి చేశారు. విజయ మృతికి కారణమైన వైద్యులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని శుక్రవారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక తహశీల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
 
  సదరు వైద్యులు, సిబ్బంది వెంటనే విధుల నుంచి తొలగించాలని, వారిపై కేసు నమోదు చేయాలని, విజయ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు జగిత్యాల ఆర్డీవో ఎస్.పద్మాకర్ వచ్చి విజయ మృతికి కారణాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ కోసం వైద్యుల బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. కలెక్టర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.  
 
 నేడు త్రీమెన్ కమిటీ విచారణ
 రాయికల్ : విజయ మృతిపై విచారణ కోసం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో డాక్టర్లు కొండల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, భానుప్రియ ఉన్నారు. వీరు శనివారం రాయికల్ ఆసుపత్రిలో విజయ మృతిపై విచారణ చేపట్టనున్నారు.
 

మరిన్ని వార్తలు