మన్మోహన్‌కు ‘పీవీ’ పురస్కారం 

26 Jan, 2019 02:40 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జయప్రకాశ్‌ నారాయణ. చిత్రంలో రామచంద్రమూర్తి, రాపోలు ఆనంద్‌ భాస్కర్‌

ఫిబ్రవరి 28న ప్రదానం 

హైదరాబాద్‌: మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నర్సింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అందించనున్నారు. ఫిబ్రవరి 28న ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో మన్మోహన్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇండియా నెక్ట్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన జ్యూరీ కమిటీ ఈ మేరకు వెల్లడించింది. శుక్రవారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైన జ్యూరీ సభ్యులు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, ఇండియా నెక్ట్స్‌ సలహా మండలి సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌లు పీవీ నర్సింహారావు జీవన సాఫల్య పురస్కారానికి మన్మోహన్‌ను అన్ని విధాలా అర్హుడిగా నిర్ణయించినట్లు ప్రకటించారు.

విశ్రాంత న్యాయమూర్తి ఎంఎన్‌ వెంకటాచలయ్య అధ్యక్షతన డాక్టర్‌ సుభాష్‌ కశ్యప్, కార్తికేయన్‌ జ్యూరీ కమిటీ సభ్యులందరం కలిసి మన్మోహన్‌ సింగ్‌ను అవార్డుకు అర్హుడిగా ఎన్నుకున్నట్లు జయప్రకాష్‌ నారాయణ తెలిపారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు జీవన సాఫల్య పురస్కారం మన్మోహన్‌ సింగ్‌కు ఇవ్వడం సముచితమన్నారు. ఇండియా నెక్ట్స్‌ జాతీయ కన్వీనర్‌ ఎస్‌వి.సూర్యప్రకాశ్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

మరిన్ని వార్తలు