రబీ పంట రుణాలు 39 శాతమే

29 Jan, 2020 02:36 IST|Sakshi

రూ.19,496 కోట్లకుగాను బ్యాంకులు ఇచ్చింది.. రూ.7,627 కోట్లే

సాక్షి, హైదరాబాద్‌: రైతులను ఆదుకోవాల్సిన బ్యాంకులు వారిని పట్టించుకోవడంలేదు. సకాలంలో ఇవ్వాల్సిన పంట రుణాలు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నాయి. ఈ రబీలో ఇప్పటికే 31.18 లక్షల ఎకరాల్లో (99%) పంటలు సాగు కాగా, ఇప్పటి వరకు ఇచ్చిన పంట రుణాలు 39.12 శాతమే. రబీలో రూ.19,496 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇచ్చింది రూ. 7,627 కోట్లేనని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

7.60 లక్షల మంది రైతులకు పంట రుణాలు ఇచ్చినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ఇటీవల వ్యవసాయ శాఖకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. బ్యాంకుల్లో రుణం దొరకకపోవడంతో రైతులు వ్యవసాయ పనులకు అవసరమైన డబ్బు కోసం ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లోనూ లక్ష్యం మేర పంట రుణాలు ఇవ్వలేదు. గడిచిన ఖరీఫ్‌లో రూ.29,244 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.18,711 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అంటే ఖరీఫ్‌ లక్ష్యంలో 63.98 శాతం మాత్రమే ఇచ్చాయి. 

మరిన్ని వార్తలు