నా పెళ్లి.. అయిపోయిందోచ్‌!

15 Aug, 2018 02:37 IST|Sakshi
హరిత ప్లాజాలో జరిగిన ఎడిటర్స్‌ మీట్‌లో జర్నలిస్టులతో మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ

అమ్మాయితో కాదు.. కాంగ్రెస్‌తో: ఎడిటర్స్‌ మీట్‌లో రాహుల్‌

ఆ ముగ్గురు నాకెప్పుడూ స్ఫూర్తే

ఎన్నికల్లో గెలుపుపై ఓ జర్నలిస్టుతో చాలెంజ్‌

రాజకీయాలతోపాటు వ్యక్తిగత అంశాలపైనా మాటాముచ్చట

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీ పెళ్లి అయిపోయిందట..! అమ్మాయి ఎవరు అని మాత్రం అడగకండి.. ఆయన పెళ్లి జరిగింది అమ్మాయితో కాదు.. కాంగ్రెస్‌ పార్టీతో!! ఈ విషయాన్ని మంగళవారం హరిత ప్లాజాలో ‘హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌’ నిర్వహించిన ఎడిటర్స్‌ మీట్‌లో రాహులే స్వయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ హడావుడి, హంగామా లేకుండా అతి సాధారణంగా టేబుల్‌ టేబుల్‌ తిరుగుతూ, కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ రాహుల్‌ ప్రసంగించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, రాజకీయాలతోపాటు వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు. జర్నలిస్టులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఇదే సందర్భంలో మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు.. బ్రహ్మచారిగానే ఉండిపోతారా అని ఓ పాత్రికేయుడు అడగ్గానే రాహుల్‌ బిగ్గరగా నవ్వేస్తూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ నే పెళ్లి చేసుకున్నా..’అంటూ బదులిచ్చారు. తొలుత మహిళా జర్నలిస్టులు కూర్చున్న టేబుల్‌ నుంచి తన చిట్‌చాట్‌ను ప్రారంభించారు. ‘అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మీకు నానమ్మ ఇందిర, అమ్మ సోనియా, సోదరి ప్రియాంకాల్లో ఎవరు స్ఫూర్తి..’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘ముగ్గురూ స్ఫూర్తే.. వాళ్లే బలం..’అని చెప్పారు. మహిళా జర్నలిస్టులున్న ఈ టేబుల్‌కు మరో రెండు నిమిషాల సమయాన్ని అధికంగా కేటాయిస్తానని చెప్పి.. వారితో అదనంగా మరో ప్రశ్న వేయించుకుని సమాధానం చెప్పారు.

సెల్‌లో రికార్డింగ్‌పై చిరు కోపం
సుమారు గంటా పది నిమిషాల పాటు జరిగిన ఈ మీట్‌లో ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టు తీరుపై రాహుల్‌ నొచ్చుకున్నారు. ‘ఈ మీట్‌ కేవలం ఆఫ్‌ ది రికార్డ్‌ కోసం ఉద్దేశించిందే.. నేను ఎంత ఫేర్‌గా ఉన్నానో.. మీరు అలాగే ఉండాలి’ అంటూ తన మాటల్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుపై చిరుకోపాన్ని ప్రదర్శించారు.

కేసీఆర్‌ కుటుంబ పాలనపై విమర్శలు చేస్తున్న మీరు.. మీ కుటుంబ పాలనపై ఏమంటారు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘మేం 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం. నా తండ్రి ప్రధాని అయ్యాక మా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరూ ప్రధాని పదవి తీసుకోలేదు’ అని బదులిచ్చారు. ఈ భేటీలో ఆయన సాధారణ వ్యక్తిలా కలిసిపోయి పూర్తి వివరాలు, విశేషాలతో కూడిన సమాధానలివ్వటంతో సమావేశం అనంతరం ఆయన్ను పలువురు ఎడిటర్లు, జర్నలిస్టులు చప్పట్లతో అభినందించారు.

సమావేశం చివరలో ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్ట్‌ శంకర్‌ రాహుల్‌పై గీసిన క్యారికేచర్‌ను ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు అందజేయగా.. ‘దీన్ని నా సోదరికి గిఫ్ట్‌గా ఇస్తా’ అంటూ తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మీట్‌కు ఎస్పీజీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటంతో ముఖ్య కాంగ్రెస్‌ నాయకులు సైతం ఇబ్బంది పడ్డారు. చివరకు ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు చొరవతో సీఎల్పీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, భట్టి విక్రమార్క లోపలికి రాగలిగారు. సుమారు 80 మందికిపైగా మీడియా ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది.

జర్నలిస్ట్‌తో చాలెంజ్‌
దేశంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో తప్పక ఓటమి పాలవుతుందని రాహుల్‌ అనడంతో.. ఓ టీవీ చానల్‌ ఎడిటర్‌ మధ్యలో కల్పించుకుని వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 100 లేదా 200 అని అడిగారు. స్పందించిన రాహుల్‌ ‘మేం గెలువబోతున్నాం.. మీకు సందేహం అవసరం లేదు’ అన్నారు. సీట్ల సంఖ్య చెప్పండి అంటూ చానల్‌ ఎడిటర్‌ మళ్లీ అడగడంతో.. రాహుల్‌ ఆయన సీటు వద్దకు వచ్చి.. ‘బెట్‌ ఏమిటో చెప్పండి’ అని అడిగారు. ‘నూరు శాతం విజయం నాదే. మేం గెలిస్తే ఏం కావాలో బెట్‌ చేయండి’ అనగా.. ప్రధాని హోదాలో ఫస్ట్‌ ఇంటర్వ్యూ తనకే ఇవ్వాలని చానల్‌ ఎడిటర్‌ బదులిచ్చారు.

ఈ బెట్‌కు రాహుల్‌ ఓకే చెప్పేయటంతో హాలంతా నవ్వుల్లో మునిగిపోయింది. రాఫెల్‌ విమానాల కొనుగోళ్లపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిపై తాను పార్లమెంటులో ప్రశ్నిస్తే తన కళ్లలో సూటిగా చూసి సమాధానం చెప్పలేక ప్రధాని దిక్కులు చూస్తూ దాటేసిపోయారన్నారు.

మరిన్ని వార్తలు