ఓటు హక్కే కాదు బాధ్యత

7 Dec, 2018 01:08 IST|Sakshi

 ప్రతి ఒక్కరూ ఓటేయాలని రజత్‌కుమార్‌ పిలుపు

పోలింగ్‌కు సర్వం సిద్ధం: సీఈఓ

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రజాస్వామ్యం దేవాలయం వంటిది. ఎవరో చెప్పారని, ఎవరు బలవంత పెట్టారనో, తాయిలాలు ఇచ్చారనో కాకుండా, అంతరాత్మ ప్రబోధంతో గుడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చినంత పవి త్రంగా ప్రతి ఒక్క పౌరుడూ పోలింగ్‌ కేంద్రానికి బాధ్యతతో వెళ్ళి ఓటు వేసి రావాలి’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లను చైతన్యపరచడానికి విస్తృతంగా కృషి చేసినందు వల్ల గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్‌ శాతం పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటును కేవలం హక్కుగానే కాకుండా ఓటర్లు బాధ్యతను గుర్తించి ఓటేయాలని కోరారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి నేడు సెలవు కూడా ప్రకటించామన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు
తెలంగాణ శాసనసభ పరిధిలోని 119 నియోజకవర్గాలకు శుక్రవారం ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతం గా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లతో సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు సీఈ ఓ ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లపై గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం 5 వరకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి వారికి రాత్రి 7 వరకు ఓటేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్‌లను వినియోగిస్తున్నామన్నారు. ఈవీఎంల వినియోగం పట్ల అపోహలను తొలగించడానికి, అవగాహన కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా నమూనా పోలింగ్‌ నిర్వహించామని, ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నా రు. ఇప్పుడు మొత్తం 44,415 బ్యాలెట్‌ యూనిట్లను (7,557 అదనంగా), 32,016 కంట్రోల్‌ యూనిట్లను (4,432 అదనంగా), 32,016 వీవీప్యాట్ల (5,261, అదనంగా)ను ఓటర్లు ఉపయోగించుకోబోతున్నారని చెప్పారు. సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు 240 మంది బీఈఎల్‌/ఈసీఐఎల్‌ ఇంజనీర్లను అన్నిచోట్ల అందుబాటులో ఉంచామని తెలిపారు.

అరగంటలో కొత్త ఈవీఎంల ఏర్పాటు
ఈవీఎంలతో అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ వినియోగిస్తున్నామని రజత్‌కుమార్‌ చెప్పారు. ఈవీఎంలతో ఎక్కడా ఎలాంటి సమస్యలు రావని, పోలింగ్‌ ప్రక్రియ ఎక్కడా ఆగదని వెల్లడించారు. ప్రతి సెక్టార్‌ మేజిస్ట్రేట్‌ వద్ద 2 ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అదనంగా అందుబాటులో ఉంటాయని, ఎక్కడైనా ఈవీ ఎంలు మొరాయిస్తే కేవలం 30 నిమిషాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా ఇప్పటివరకు రూ.135 కోట్లు సీజ్‌ చేశామని, ఇప్పటివరకు ఇదే రికార్డు అని చెప్పారు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అరెస్టు ఘటనపై వచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన జరుపుతోందన్నారు. డిసెంబర్‌ 26 నుంచి పార్లమెంటు ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రూపకల్పన ప్రారంభిస్తామని, ఓటు లేని వాళ్ళు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తుది జాబితాలో కొన్ని తప్పులున్నాయని ఫిర్యాదులున్న నేపథ్యంలో మళ్ళీ పరిశీలన చేసి సరిదిద్దుతామని చెప్పారు. 

మరిన్ని వార్తలు