ఆర్డీఎస్ పనులకు బ్రేక్..?

29 Jul, 2014 04:50 IST|Sakshi
ఆర్డీఎస్ పనులకు బ్రేక్..?

గద్వాల : రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) పనులకు బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. వచ్చే జనవరి దాకా పనులు జరిగేలా లేవు. ప్రాజెక్టుకు ప్రస్తుతం భారీగా వరద వస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వాలు ఆర్డీఎస్ సమస్యపై శ్రద్ధ చూపి తక్షణం పరిష్కరించడంలో చొరవ చూపకపోవడం.. లేఖలతో కాలయాపన చేయడం కూడా కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర రిజర్వాయర్‌కు భారీగా ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. దీంతో తుంగభద్ర ప్రాజెక్టు అధికారులు ఆయకట్టు పొలాలకు ఖరీఫ్ నీటిని రెండు రోజుల క్రితమే వదిలారు.

పొలాల ద్వారా తిరిగి నదిలోకి చేరే రీజనరేట్ వాటర్ నది ద్వారా ఆర్డీఎస్ ప్రధాన నిర్మాణానికి మరో రెండు రోజుల్లో చేరే అవకాశం ఉంది. కేవలం వేయి క్యూసెక్కుల వరద నీరు ఆర్డీఎస్‌కు చేరినా పనులు నిలిచిపోతాయి. ఇప్పటివరకు పనులు ప్రారంభించేందుకు ఏ చర్యలూ లేనందున ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు వచ్చే జనవరి వరకు వాయిదా పడినట్లే. తుంగభద్ర నుంచి విడుదలవుతున్న వరద నీటితో మరో వారం రోజుల్లో ఆర్డీఎస్ ప్రధాన నిర్మాణానికి ఇన్‌ఫ్లో భారీగా ప్రారంభమైతే ఆర్డీఎస్ పరిధిలో ఖరీఫ్ పంటలకు నీటి విడుదల చేయాల్సి ఉంది.

ప్యాకేజీ-2 పరిధిలో ఒక అరకిలోమీటర్ మేర ఉన్న రాతి గోడలను పగులగొట్టిన కాంట్రాక్టర్ కాలువలలో పడిన రాళ్లను ఇప్పటి వరకు తొలగించలేదు. నీటి విడుదల ప్రారంభమయ్యేలోగా మన రాష్ట్ర అధికారులు కర్ణాటక అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రధాన కాలువలో ఉన్న అడ్డంకులను తక్షణమే తొలగించేలా చేయాల్సి ఉంది. లేనిపక్షంలో వచ్చే కొద్దిపాటి ప్రవాహానికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి ఆయకట్టు అవసరాలకు 800 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలలో అడ్డంకులు తొలగకపోతే మన రాష్ట్ర పరిధిలోకి కాలువ ద్వారా వచ్చే నీటి సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఈ విషయమై ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ప్రధాన కాలువల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అడ్డంకులు తొలగించేలా ప్రయత్నిస్తానన్నారు.

మరిన్ని వార్తలు