విశ్వ ప్రయత్నం...

14 Oct, 2014 01:57 IST|Sakshi
విశ్వ ప్రయత్నం...

చిన్నారి గిరిజ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అభంశుభం తెలియని ఆ చిట్టితల్లి ప్రాణాలతో బయటపడాలని అందరూ కోరుకుంటున్నా.. రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యమవుతున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. మంచాల సమీపంలో ఆదివారం ఉదయం గిరిజ అనే చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలిక కోసం బంధువులు రెండు రోజులుగా అన్నపానీయాలు మాని ఘటనా స్థలంలోనే గుండెలవిసేలా రోదిస్తున్నారు.

మరోవైపు అధికార యంత్రాం గం చిన్నారిని వెలికి తీసేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. సింగరేణి నుంచి వచ్చిన టీంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తవ్వకాల్లో పెద్ద బండరాళ్లు బయల్పడుతుండడంతో అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. కలెక్టర్ శ్రీధర్ రెండు రోజులుగా ఘటనా స్థలంలోనే ఉండి పనులను సమీక్షిస్తున్నారు.

 
బాలిక కోసం కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్
* బోరుబావిలోనే చిన్నారి గిరిజ..
* ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు  

* పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే
* వివరాలు సేకరించిన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజను బోరుబావిలోంచి వెలికితీసేందుకు యంత్రాంగం సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం ఉద యం 10:30 గంటల సమయంలో మంచాలకు చెందిన చిన్నారి గిరిజ(4) పొలం వద్ద తన అన్న చరణ్‌తో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచిఉన్న బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకున్న యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆదివా రం రాత్రి జేసీబీ, హిటాచీలతో బోరుబావికి సమాంతరంగా గుంతలు తవ్వినా ఫలితం లేకుండా పోయింది.
 
సహాయక చర్యలకు ఆటంకం...
బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్న భూమి గట్టిగా ఉండడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మొదటగా చిన్నారి దాదాపు 35 అడుగుల లోతులో ఉందని గమనించిన అధికారులు ఆదిశగా తవ్వకాలను ప్రారంభించారు. 40 అడుగులు దాటిన తర్వాత  రాయి రావడంతో తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. యంత్రాంగం రాయిని డ్రిల్‌చేసి ముందకు కొనసాగారు.  
 
అధికారుల దృఢ సంకల్పం..

చిన్నారి గిరిజను ఎలాగైనా కాపాడాలనే కృతనిశ్చయంతో యంత్రాంగం ముందుకు సాగుతోంది. చిన్నారి శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది నిరంతరం గొట్టాల ద్వారా ఆక్సీజన్ అందిస్తూనే ఉంది.  
 
బంధువుల జాగారం..
బోరుబావిలో పడిపోయిన తమ చిన్నారి ఎలాగైనా ప్రాణాలతో బయటపడుతుందని బంధువులు, కుటుంబీకులు కొండంత నమ్మకంతో ఉన్నారు. ఆదివారం ఉదయం ఘటన జరిగినప్పటి నుంచి వారు అక్కడే ఉన్నారు. నిద్ర, తిండీతిప్పలు లేకుండా బోరుబావి వద్దే జాగారం చేస్తున్నారు. బాలిక అమ్మమ్మ ఐల మ్మ, తండ్రి ఐలయ్యలు రోదిస్తూనే ఉన్నారు. సోమవారం  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సహాయక చర్యలను పరిశీలించారు.  

మంచాల గ్రామానికి చెందిన కోట్ల సుధీర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి భోజనవసతి ఏర్పాటు చేసి ఔదార్యం చాటుకున్నారు.   ఆదివారం సాయంత్రమే ఎన్‌డీ ఆర్‌ఎఫ్ టీం రంగంలోకి దిగింది. అదే రాత్రి మైన్స్ రెస్క్యూ టీం కూడా వచ్చింది. సోమవారం సాయంత్రం 4:20 గంటల సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, మైన్స్ రెస్క్యూ టీంలు బోరుబావికి అడ్డంగా ప్లేటు వేయాడానికి తవ్వకాలు ప్రారంభించారు. పలు ఆటంకాలు ఎదురైనా అధికారులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు.

సోమవారం రాత్రి లైటింగ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక వెళ్లిపోయిన కలెక్టర్ శ్రీధర్ తిరిగి సోమవారం ఉదయం 11:45 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. జేసీ ఎంవీ రెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వచ్చారు.

పనులు వేగవంతం చేయాలని ఆయన యంత్రాగాన్ని కోరారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్తుండగా ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడుతుండ గా పక్కన ఉన్న వాళ్లు ఆయనను పట్టుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంజర్ల శేఖర్‌రెడ్డి సాయంత్రం బోరుబావి వద్దకు వచ్చారు. వేలాదిమంది ప్రజలు ఘటనా స్థలంలో చిన్నారి రాకకోసం నిరీక్షిస్తున్నారు.  
 
వివరాలు సేకరించిన ఎంపీ

ఆదివారం రాత్రి 10 గంటలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.  చిన్నారి గిరిజ కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. బాలికను సురక్షితంగా వెలికితీసే వరకు యంత్రాంగం, నాయకులు కృషిచేస్తారని ఆయన భరోసా కల్పించారు.  
 
క్షణక్షణం ఉత్కంఠ..
ఆదిబట్ల: చిన్నారి ఆచూకీ కోసం క్షణక్షణం ఉత్కంఠ సాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా జనం పోగయ్యారు. జనం కిక్కిరిసిపోవడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచాల మండలంలో ఎవరిని కదిలించినా చిన్నారి బోరుబావిలో పడిన విషయమే మాట్లాడుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు