రెవెన్యూ లీలలు..

30 Apr, 2015 23:50 IST|Sakshi
రెవెన్యూ లీలలు..

మంచాల: మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరు కంచే చేను మేసిన చందంగా మారింది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు దళారులకు, ఆక్రమణదారులకు ఆసరాగా నిలుస్తున్నారు. దీంతో విలువైన భూముల అక్రమ విక్రయాలు కొనసాగుతున్నాయి. వివరాలు.. ఖానాపూర్ గ్రామంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నాగార్జున సాగర్ -హైదరాబాద్ దారి సమీపంలో ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ధర పలుకుతోంది.

భూముల ధరలు విపరీతంగా పెరగడంతో దళారులు, రెవెన్యూ అధికారులతో మిలాఖత్ అవుతున్నారు. రికార్డులను తారుమారు చేస్తున్నారు. తిరిగి ఆ భూములను అక్రమంగా విక్రయిస్తున్నారు. ఖానాపూర్ గ్రామంలో అక్రమ విక్రయాల తంతు జోరుగా కొనసాగుతోంది. అందుకు 67 సర్వే నంబర్‌లోని భూమి  ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ సర్వే నంబర్‌లో 310 ఎకరాలు భూమి ఉంది. కానీ అధికారులు గుర్తించింది మాత్రం 280 ఎకరాలు మాత్రమే.

ఇంకా అధికారికంగా 30 ఎకరాల వరకు ఉంది. ఈ 30 ఎకరాల భూముల్లో అక్కడక్కడా కొంత మంది కబ్జాలో ఉన్నారు. కాని వాస్తవంగా వారికి పట్టా లేదు. రికార్డుల్లో కూడా లేరు. ఇది గమనించిన దళారులు రియల్ వ్యాపారులతో చేతులు కలిపి పట్టా భూమితో పాటు మిగులు 30 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. 30 ఎకరాల భూమిలో అనర్హులు సైతం తమ పేర్ల మీద పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. 67 సర్వే నంబర్‌ను 67/1 నుంచి 67/26 వరకు నంబర్లను పొడిగించారు.

అందులో ఈ భూమికి సంబంధంలేని వ్యక్తులు, స్థానికేతరులు కూడా పట్టా పాసు పుస్తకాలు తయారు చేసుకున్నారు. వారు యథేచ్ఛగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ తతంగమంతా బడా రియల్ వ్యాపారుల కనుసైగలో నడుస్తోంది. విలువైన 30 ఎకరాలను ఆక్రమణలో భాగంగానే అక్రమ పట్టా పాసు పుస్తకాలు, తప్పుడు రికార్డులు తయారు చేస్తున్నారు. అటు రియల్ వ్యాపారులు, ఇటు దళారులు కలిసి ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

కొంతమంది ఒకే కుటుంబంలో ముగ్గురు పేర్లపై అక్రమ పట్టాలు పొందారు. ఒక్కరే మూడు పేర్లతో మూడు అక్రమ పట్టా పాసు పుస్తకాలు పొందడం గమనార్హం. ఇలా విలువైన 30 ఎకరాల భూమిని దళారులు తప్పుడు రికార్డులు తయారుచేసి రియల్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు.

ఈ అక్రమాలపై స్థానికులు ఇటీవలే జిల్లా కలెక్టర్‌ను కలిసి వివవించారు. అక్రమ పట్టాల విషయంలో విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ టి.శ్యాంప్రకాష్ వివరణ కోరగా..  పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు