యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా

31 Oct, 2017 16:47 IST|Sakshi

దామరగిద్ద (నారాయణపేట): బియ్యం అక్రమ రవాణ చేపట్టే వారిపై అధికారులు తరచూ కేసులు నమోదు చేస్తున్నా.. అక్ర మ రవాణ ఆగడం లేదు. దొరికితే సరే.. లేదంటే తక్కువ రేటుకు కొన్న బియ్యం వందశాతం లాభంతో పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని గురిమిట్కల్‌లో ఓ రైస్‌మిల్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సోమవారం మద్దూరు మండలానికి చెందిన దినేష్‌ అనే ఓ వ్యాపారి మద్దూరులో కొనుగోలు చేసిన రేషన్‌ బియ్యాన్ని టాటా ఏస్‌ వాహనం లో కర్ణాటకకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సినీఫక్కీలో ఓవర్‌ స్పీడ్‌లో వెళ్తూ యానాగంది స్టేజీ దగ్గర బోల్తా పడింది. సంఘటనకు సంబంధించి అధికారుల కథనం ప్రకారం..

సినీఫక్కీలో తప్పించే యత్నం..
సోమవారం ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన ఓ విలేకరి ద్వారా బియ్యం అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న తహసీల్దార్‌ బాలాజీ గ్రామంలోని వీఆర్‌ఏలను పురమాయించారు. దీంతో వారు వెళ్లి వాహనాన్ని అడ్డుకోవడంతో అక్కడే నిలిపారు. డ్రైవర్‌ బియ్యం ఓనర్‌ దినేష్‌కు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకునే లోపు డ్రైవర్‌ను తప్పించి వారు వాహనం నడిపారు. అడ్డుకున్న గ్రామసేవకులపెకి వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో కాశప్ప మరో ఇద్దరు కావలికార్లు కిందపడగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి వచ్చిన ఆర్‌ఐ కుమారస్వామి, వీఆర్‌ఓ హన్మంతు, వీఆర్‌ఏ దుర్గయ్య బియ్యం వాహనాన్ని వెంబడించారు. రెండు కిలోమీటర్లు అతివేగంగా వెళ్లి యానాగుంది స్టేజీ సమీపంలో బోల్తాపడింది. వాహనానికి నంబర్‌ ప్లేట్‌ కూడా లేకపోవడం గమనార్హం. తహసీల్దార్‌ దామరగిద్ద పోలీసులకు సమాచారం ఇవ్వగా కానిస్టేబుల్‌ అక్కడికి చేరుకుని.. కర్ణాటక శివారు కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకకు చెందిన మోదెల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ తహసీల్దార్‌ రిపోర్టు ఆధారంగా దాదాపు 50 సంచుల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి సీజ్‌ చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు
కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సింగోటం గ్రామంలో ఉన్న శ్రీనివాస బిన్ని మాడల్‌ రైస్‌మిల్‌పై రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈసందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఓఎస్‌డీ విశ్వనాథం విలేకరులతో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు బిన్ని మాడల్‌ రైస్‌మిల్‌ను దాడులు చేపట్టామన్నారు. ఇందులో 4,030 క్వింటాళ్ల బియ్యాన్ని రైస్‌మిల్లులోకి సరఫరా చేశారన్నారు. 4 వేల క్వింటాళ్లు మళ్లీ ప్రభుత్వానికి మిషన్‌ ఆడించి పంపించినట్లు గుర్తించామన్నారు. 12 వేల క్వింటాళ్ల వడ్లను మిషన్‌లో ఆడించారని, 11 వేల క్వింటాళ్ల లెవీ బియ్యాన్ని తయారు చేశారన్నారు. 43 వేల క్వింటాళ్ల బియ్యం రైస్‌మిల్లులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి చెందిన బియ్యాన్నే తీసుకొచ్చి రైస్‌ మిల్లులో సన్నగా చేసి మళ్లీ ప్రభుత్వానికే విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మొత్తం మిల్లు తనిఖీ చేయగా 30.50 క్వింటాళ్ల బియ్యం దొరికాయని, వాటిని సీజ్‌ చేశామన్నారు. ఈ మేరకు రైస్‌మిల్‌ యజమాని శ్రీనివాస్‌పై 6–ఏ రిపోర్ట్‌ పెట్టి జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సీఈ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయడానికి అధికారులకు రెఫర్‌ చేస్తామని, పోలీస్‌ కేసు సైతం పెడతామన్నారు. దాడుల్లో సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, తహసీల్దార్‌ కమాల్‌పాష, సీఐ రాములు, జిల్లా అసిస్టెంట్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారి ఎండీ ఫైసల్, ఎస్‌ఐ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు