‘బతుకమ్మ’లో విభేదాలు

26 Sep, 2014 01:03 IST|Sakshi
‘బతుకమ్మ’లో విభేదాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని మహిళా ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న విభేదాలు గురువారం బతుకమ్మ నిర్వహణ సందర్భంగా బయటపడ్డాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ముందున్న కార్ల పార్కింగ్ ఆవరణలో బతుకమ్మను తామంటే.. తాము నిర్వహిస్తామని తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం, సచివాలయ టీఎన్‌జీఓ మహిళా విభాగం ప్రతినిధులు వాదనలు చేసుకోగా.. పోలీసులు కల్పించుకొని కలిసి చేసుకొమ్మని సర్దిచెప్పారు. దీంతో వేర్వేరుగా పెట్టుకున్న బతుకమ్మలను ఒకేదగ్గర పెట్టుకొని కాసేపు ఆడారు. అయితే తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్కను ఆహ్వానించారు. దీంతో తమకు తెలియకుండా ఆమెను ఎలా ఆహ్వానిస్తారని వాపోయిన సచివాలయ ఉద్యోగుల సంఘం, సచివాలయ టీఎన్‌జీఓ మహిళా విభాగం వారు తమ బతుకమ్మలను పక్కకు తీసుకెళ్లి వేరుగా ఆడుకున్నారు.
 
ఇక బహుజన బతుకమ్మతో చేరుకున్న విమలక్క తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం వారితో కలిసి ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం అందరిది అనీ, అక్కడ ఆడి పాడే హక్కు అందరికీ ఉందన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించవద్దని కోరారు. సహజ వనరులను కాపాడటమే లక్ష్యంగా తాము బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఉత్సాహంతో బతుకమ్మ ఉత్సవం నిర్వహించారు. అయితే విమలక్కను సచివాలయంలో లోపలికి వచ్చే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయమై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో.. ఆయన ఆదేశాల మేరకు విమలక్కను సచివాలయంలోకి అనుమతించారు.

మరిన్ని వార్తలు