చక్రాలకు బ్రేక్

6 May, 2015 07:52 IST|Sakshi
మంగళవారం సచివాలయంలో టీఎస్ ఆర్టీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్న మంత్రి మహేందర్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
 
కార్మికుల వేతన సవరణపై చర్చలు విఫలం
27% ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా మారుస్తామన్న ప్రభుత్వం
43% ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక సంఘాల పట్టు
రోజంతా చర్చోపచర్చలు.. హైడ్రామా
మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్న సర్కారు
సమ్మెకే కార్మిక సంఘాల నిర్ణయం
ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు
సూపర్‌వైజర్లూ లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు విఘాతం
{పయాణికులకు తీవ్ర ఇక్కట్లు

 
హైదరాబాద్:  ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రభుత్వ వర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ, ఏపీలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే సర్వీసులన్నీ ఆగిపోయాయి. 27 శాతంగా ఉన్న మధ్యంతర భృతి(ఐఆర్)ని ఫిట్‌మెంట్‌గా మారుస్తామని, మెరుగైన వేతన సవరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను కార్మిక సంఘాలు తోసిపుచ్చడంతో సమ్మె అనివార్యమైంది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో బస్సు సర్వీసులకు అంతరాయం ఎదురైంది. ప్రయాణికులకు ఇక్కట్లు మొదలయ్యాయి.

చివరిరోజు హైరానా...: మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధం కాగా.. అప్పటి వరకు చోద్యం చూసిన రాష్ర్ట ప్రభుత్వం చివరిరోజున హడావుడి చేసింది. ఉదయం బస్‌భవన్‌లో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)-తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కూటమి ప్రతినిధులతో సంస్థ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 43 శాతం ఫిట్‌మెంట్ కోసం పట్టుబట్టడం సరికాదని ఎండీ పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ దుస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని, దాన్ని వేతన సవరణ కు ముడిపెట్టడం సరికాదని కార్మిక సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న 27 శాతం ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా మారుస్తామని యాజమాన్యం ప్రకటించడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి.

మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించి కార్మిక సంఘాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 43 శాతం వేతన సవరణకు పట్టుబట్టడం సరికాదని, దాదాపు రూ.850 కోట్ల భారం పడుతున్నప్పటికీ 27 శాతం ఫిట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు పట్టువీడాలని, సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమని తేల్చి చెప్పారు. దీంతో ఇక సమ్మె తప్పదనే సంకేతాలు వెళ్లాయి. కాగా, సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావుతో ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు భేటీ అయ్యారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, 43 శాతం ఫిట్‌మెంట్‌తో పడే భారం, నిధుల సమీకరణ యత్నాలు వంటి వివరాలను ఆయన ముందుంచారు. అప్పటికే ఓ నిర్ణయంతో ఉన్న ముఖ్యమంత్రి.. వెంటనే కార్మిక సంఘం నేతలతో చర్చించాల్సిందిగా మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డిని పురమాయించారు. దీంతో నాయిని చాంబర్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘ చర్చలు జరిగాయి.
 
కాలయాపనతో గందరగోళం...
 
43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించకుంటే సమ్మెకు దిగుతామని పక్షం రోజుల క్రితమే ఆర్టీసీ గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి నోటీసు ఇచ్చింది. ఆ వెంటనే ఎండీ సాంబశివరావు వారితో చర్చించి అంత ఫిట్‌మెంట్ ఇవ్వాలంటే ఆర్టీసీపై రూ.1800 కోట్ల భారం పడుతుందని, దాన్ని భరించే శక్తి ఆర్టీసీకి లేదని తేల్చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని భరిస్తేనే ఆ మేరకు పెంపు సాధ్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చివరి వరకూ పెద్దగా పట్టించుకోకపోవడంతో సమ్మెకు దారితీసింది.

రంగంలోకి ప్రైవేట్ డ్రైవర్లు

సమ్మె అనివార్యమైతే ఒక్క రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితం కావద్దన్న ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం మూడు రోజుల క్రితమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లను సమీకరించింది. అందుబాటులో ఉన్న డ్రైవర్లను గుర్తించి ఆర్టీసీకి కేటాయించాల్సిందిగా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు వెళ్లాయి. ఇలా ఇప్పటివరకు సమీకరించిన దాదాపు ఐదు వేల మంది ప్రైవేటు డ్రైవర్లను రంగంలోకి దింపారు. మరో ఐదు వేల మందిని రెండు రోజుల్లో నియమించే పనిలోపడ్డారు. ప్రైవేటు డ్రైవర్లకు రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. కండక్టర్ విధులు నిర్వర్తించే వారికి రూ.800 చొప్పున చెల్లిస్తారు. అలాగే ప్రైవేటు వాహనాలు, ఓమ్ని బస్సులకు స్టేజీ క్యారియర్‌గా తిప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఒక్కో వాహనం ప్రత్యేక ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం ఉత్తర్వులు జారీకానున్నాయి.
 
సూపర్‌వైజర్లూ లేకపోతే ఇబ్బందే

కార్మికులతో పాటు ఆర్టీసీ సూపర్‌వైజర్ల సంఘం కూడా సమ్మె బాట పట్టడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. కానీ అలా వచ్చే డ్రైవర్లకు సూచనలు చేయాలన్నా, వారిని నియంత్రించాలన్నా, వారి డ్రైవింగ్ సామర్థ్యాన్ని పరిశీలించాలన్నా డిపోలో సిబ్బంది అవసరం. కానీ దాదాపు అన్ని విభాగాల సిబ్బంది సమ్మెకు దిగారు. డిపో మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది మినహా మరెవరూ విధుల్లో లేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడపడం కుదిరేలా కనిపించడం లేదు.

ఎన్నికల వేళ కార్మిక సంఘాల పట్టు

వేతన సవరణ విషయంలో గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి బెట్టు వీడకపోవడానికి కారణం ఎన్నికలే. ప్రస్తుత గుర్తింపు యూనియన్ గడువు తీరిపోయింది. దీంతో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో వేతన సవరణపై బెట్టు వీడితే కార్మికుల్లో చెడ్డ పేరు వస్తుందని గుర్తింపు సంఘం కూటమి ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ వాదనకు తలొగ్గి సమస్యను కొనితెచ్చుకోవద్దన్న అభిప్రాయంతోనే సమ్మెకు దారితీసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రావాలంటే 62 శాతం ఫిట్‌మెంట్ కావాలని, అయితే గుర్తింపు సంఘం మాత్రం 43 శాతమే డిమాండ్ చేసి కార్మికులకు అన్యాయం చేసిందంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఇప్పటికే దాడి ప్రారంభించింది.

 చార్జీలు 40 శాతం పెంచాల్సి వస్తుంది

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నందున సమ్మె వద్దని సర్కారు చేసిన విన్నపాన్ని కార్మిక సంఘాలు మొండిగా తిరస్కరించాయి. సమస్యల పరిష్కారానికి మరింత గడువు కోరినా వినలేదు. 43 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలంటే దాదాపు 40 శాతం వరకు టికెట్ ధరలు పెంచాల్సి వస్తుంది. ఇంతభారం ప్రజలపై మోపడం సరికాదు. ఆర్టీసీని కూడా లాభాల బాట పట్టించే పక్కా ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. దాన్ని అమలు చేసి భవిష్యత్తులో లాభాలు వస్తే కార్మికులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అయినా సమ్మెకు దిగారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాం.                 

- రాష్ర్ట రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి
 

 ఇప్పటికే కాలయాపన

 ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు దాటినా స్పందించలేదు. ఇప్పుడు గడువు కోరడం దాటవేసేందుకే. 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే వరకూ సమ్మె విరమించేది లేదు. జీతాలు పెంచితే 40 శాతం చార్జీలు పెంచాలన్న వాదన అసత్యం. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపి పక్కదారి పట్టిస్తోంది. నిర్వహణ మా చేతికిస్తే పైసా చార్జీలు పెంచకుండా జీతాలు పెంచుకుంటాం. డీజిల్, రవాణా పన్ను రూపేణ ఆర్టీసీ నుంచి ప్రభుత్వం ఏటా రూ. 400 కోట్లు వసూలు చేస్తోంది. పైగా పలు వర్గాలకు ఇస్తున్న రాయితీల డబ్బును ప్రభుత్వం చెల్లించడం లేదు. రీయింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించి, మూడేళ్ల పన్ను మినహాయింపునిస్తే చాలు ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొత్త రాష్ట్రంలో జీతాలు పెరిగాయి. మేం ఏం పాపం చేశాం. తెలంగాణ కోసం చాలా పోరాటం చేశాం. ముఖ్యమంత్రికి వాస్తవ పరిస్థితి తెలుసు. ఆయన చొరవ తీసుకుని సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం మాకుంది. అప్పటి వరకు సమ్మె వల్ల ప్రజలు పడే ఇబ్బందులకు యాజమాన్యమే బాధ్యత వహించాలి. సమ్మెకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డ్రైవర్లను, అడ్డా కూలీలను వినియోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.                   

   -- కార్మిక సంఘాల నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి
 

ఏపీలోనూ నిలిచిన బస్సులు

ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైంది. రాష్ట్రంలోని 126 బస్సు డిపోలు, నాలుగు వర్క్‌షాపుల్లో ఇది కొనసాగనుంది. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ర్ట రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. ప్రైవేటు బస్సుల యజమానులతో, దక్షిణ మధ్య రైల్వేతో మాట్లాడుతామని పేర్కొన్నారు. సమ్మెపై కేబినెట్‌లో చర్చించామని, సీఎం వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రిలోగా కార్మిక సంఘాలతో చర్చించి సమ్మె విరమణకు ప్రయత్నిస్తామన్నారు. ఏపీ ఆర్టీసీలో 68 వేల మంది కార్మికులు ఉన్నారని, వీరికి ఫిట్‌మెంట్ ప్రకటించాలంటే బస్సు చార్జీలను కనీసం 15 శాతం పెంచాలని సీఎం చంద్రబాబు ద ృష్టికి తీసుకెళ్లామని, అయితే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీకి అన్ని విషయాలు చెప్పి కార్మిక సంఘాలు సమ్మెను విరమించుకోవాలన్నారు. మరోవైపు ఆర్టీసీలో వేతన సవరణ, సంస్థాగత సామర్థ్యం పెంపు కోసం ఆర్థిక, రవాణా, కార్మిక శాఖల మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 15లోగా ఈ మంత్రుల కమిటీ నివేదిక సమర్పిస్తుంది.  
 
10,800  రాష్ట్రంలో నిలిచిపోనున్న బస్సులు
94  మొత్తం డిపోలు
2 వర్క్ షాపులు
57,500 కార్మికుల సంఖ్య

>
మరిన్ని వార్తలు