ఆర్టీసీ సమ్మెః ఎక్కువ బస్సులు నడపండి

22 Oct, 2019 10:55 IST|Sakshi
ఇమ్లీబన్‌లో బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు

కుటుంబసభ్యులతో రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ వద్ద నిరసన

ప్రభుత్వం దిగొచ్చేవరకు ఆందోళన విరమించబోమని హెచ్చరిక  

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం 18వ రోజుకు చేరుకుంది. రెండొంతుల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, తదితర కేటగిరీలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలిసి డిపోలు, బస్‌స్టేషన్‌ల వద్ద బైఠాయించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, బస్‌భవన్‌ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. సెప్టెంబర్‌ నెల జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా కాంగ్రెస్‌ ప్రగతి భవన్‌ ముట్టడి చేపట్టడం, మరోవైపు కార్మికులు తమ కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగడంతో  బస్‌డిపోలు, ప్రయాణ ప్రాంగణాల వద్ద, బస్‌భవన్‌ వద్ద  పోలీసులు గట్టిభద్రతను ఏర్పాటు చేశారు. ఇక కార్మికులు 30వ తేదీన సకలజనుల సమరభేరి నిర్వహించనున్నారు. 

అంతంత మాత్రంగా ఆర్టీసీ బస్సులు....
కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక సిబ్బంది సహాయంతో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ డ్రైవర్ల కొరత కారణంగా ప్రయాణికులు, విద్యార్థుల రద్దీకి తగిన విధంగా బస్సులు నడపలేకపోయారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. విద్యార్థులు సకాలంలో కాలేజీలకు చేరుకోలేకపోయారు.   

ఎక్కువ బస్సులు నడపండి: మేడ్చల్‌ కలెక్టర్‌
నేరేడ్‌మెట్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఎక్కువ బస్సులు నడపాలని మేడ్చల్‌ కలెక్టర్‌ ఎంవీరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నేరేడ్‌మెట్‌ వాయుపురిలోని మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఆయన తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా డిపోలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రయాణికుల అవసరాలు తీర్చాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా