ఇసుక బుక్కేస్తున్నారు..!

8 Aug, 2014 02:50 IST|Sakshi
ఇసుక బుక్కేస్తున్నారు..!

 సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘‘ఇసుక వ్యాపారులతో ఏగలేక పోతున్నాం. రైతులం ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. అధికారులు పూర్తిగా వదిలే శారు. మీరన్నా ఇసుక తవ్వకాలను ఆపించి బోర్లు ఎండిపోకుండా చూడాలి సార్...’’ అంటూ ఇటీవల ఓ ప్రైవేటు టీవీచానల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన ఓ యువరైతు చేసిన వేడుకోలు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జిల్లాలో ఇసుక దందా ఏ రీతిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవడానికి. వాస్తవానికి అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖలకు చెందిన అధికారులు అంతగా దృష్టి సారించకపోవడం వల్లే ఇసుక వ్యాపారం మూడు లారీలు.. అరవై ట్రిప్పులుగా విరాజిల్లుతోంది. ఉన్నతాధికారులకు కూతవేటు దూరంలో ఉండే గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ వేలాది ఇసుక కుప్పలు రహదారుల వెంట, చెలకల్లో, గ్రామ శివార్లలో కనిపిస్తున్నాయి.
 
 కానీ, అధికారులకు ఇవి ఎందుకు కనపడడం లేదన్నది బేతాళ ప్రశ్న.  నల్లగొండ మండల పరిధిలోని నర్సింగ్‌భట్ల గ్రామానికి వెళితే చాలు ఎంత పెద్దమొత్తంలో ఇసుక డంపులు ఉన్నాయో తెలిసిపోతుంది. కనగల్ వాగూ ఇప్పటికే లూటీ అయ్యింది.  ఈ రెండు మండలాల పరిధిలోని వాగుల నుంచి  నిత్యం 60 నుంచి70 లారీలు ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ అక్రమ దందా జోరుగా సాగుతోందన్నది ప్రధాన విమర్శ.  ఇసుక లారీలు రాత్రి 10 గంటలు దాటాక మొదలు పెట్టి ఉదయం 9 గంటల వరకు  హైదరాబాద్‌కు వెళ్తుంటాయి. ఈ లారీలకు కొందరు యువకులను ఎస్కార్టుగా నియమించుకుంటున్నారు. కార్లలో, లేదంటే మోటార్ బైక్‌లపై ముందు వారెళ్తుంటే వాహనాలు బారులు దీరి వెళుతున్నాయి.
 
 మరికొందరు వ్యాపారులు ముందే తమ వాహనాలు వెళ్లాల్సిన మార్గంలోని పోలీసుస్టేషన్లతో మాట్లాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇవి కాకుండా ఇంకొందరు పోలీసులు లారీలను అడ్డగిస్తూ లారీకి కనీసం రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు పోలీసులకేం తీసిపోవడం లేదు.  ఉదాహరణగా నల్లగొండ తహసీల్దార్ కార్యాలయాన్నే తీసుకుంటే ఇక్కడ పనిచేస్తున్న ఓ ముగ్గురు ఉద్యోగులు ఇసుక వసూళ్ల దందాలో రారాజులుగా మారారు. ఈ  ముగ్గురూ ఇసుక లారీల నుంచి చేస్తున్న వసూళ్ల వ్యవహారం  బహిరంగ రహస్యంగా మారింది. దేవరకొండ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్ వెనుక గుండ్లపల్లి, కంచనపల్లి, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో కాపు కాసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘డబ్బులు ఇస్తే వదిలేస్తున్నారు. ఇవ్వకపోతే వాల్టా కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని..’ ఇటీవల  ఓ నాయకుడు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు.
 
 పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకుని ఫైన్ వేసిన లారీల నుంచి  ఇసుకను రెవెన్యూ కార్యాలయంలో అన్‌లోడ్ (డంప్) చేయాల్సి ఉంది. లారీకి రూ. 25 వేల ఫైన్ వేస్తున్న అధికారులు ఇసుకను అన్‌లోడ్ చేయించకుండా వదిలేసేందుకు ఒక్కోలారీ నుంచి రూ. 15 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారని సమాచారం. ఎన్నికల తర్వాత  నుంచి ఇప్పటి  వరకు రూ.25వేల ఫైన్ వేసిన ఏ ఒక్క లారీలోని ఇసుకను డంప్ చేయించలేదంటున్నారు. ఇసుక అక్రమ దందాను నియంత్రించాల్సిన రెండు శాఖల అధికారులే వసూళ్లకు అలవాటు పడడంతో వాగుల్లో ఇసుక కనుమరుగవుతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి  ప్రమాదకరస్థాయికి చేరుకునే ముప్పు పొంచి ఉంది. ఉన్నతాధికారులు మేల్కొని చర్యలు తీసుకోకుంటే వాగులే కాదు, వ్యవసాయ బోర్లూ అడుగంటే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు