నీతులు చెబుతున్న హరీష్రావు: సండ్ర

7 Nov, 2014 12:57 IST|Sakshi
నీతులు చెబుతున్న హరీష్రావు: సండ్ర

హైదరాబాద్:  గతంలో అసెంబ్లీలో వ్యవహరించిన తీరును మరిచిపోయి భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్రావు ప్రస్తుతం నీతులు చెబుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎద్దేవా చేశారు. టీటీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత అసెంబ్లీ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని అధికార టీఆర్ఎస్ నేతలు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.

అందులోభాగంగానే టీడీపీపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో వారి సంఖ్యను తగ్గించారని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా అమరవీరుల త్యాగాలను అవమానిస్తున్నారని సండ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల అవమానకరంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారంతో క్షమాపలు చెప్పించాలని అధికార పార్టీకి సూచించారు. ఆ తర్వాతే  ఎలాంటి చర్చకైనా సిద్ధమని సండ్ర స్పష్టం చేశారు.

ప్రతిపక్షంగా ఉండాల్సిన ఎంఐఎం అధికార పార్టీకి తొత్తుగా మారి భజన చేస్తుందని  విమర్శించారు. తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని అధికార పార్టీ టీఆర్ఎస్ను డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ టీటీడీపీ శుక్రవారం సభ కార్యక్రమాలకు అడ్డుతగిలింది. ఆ క్రమంలో టీటీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయాలని సభలో హరీష్ రావు తీర్మానం ప్రవేశ పెట్టారు. దాంతో స్పీకర్ టీటీడీపీ ఎమ్మెల్యేలపై ఓ రోజు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో హరీష్రావుపై సండ్ర వెంకట వీరయ్య పైవిధంగా స్పందించారు.

మరిన్ని వార్తలు