మెత్తబడని అసమ్మతి!

3 Sep, 2023 06:15 IST|Sakshi

అసంతృప్తులను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తంటాలు

ముఖ్య నేతలకు సర్దిచెప్పడంలో కేసీఆర్‌ సహా కీలక నేతలు బిజీ

పార్టీని వీడే దిశగా మైనంపల్లి, మాజీ మంత్రి తుమ్మల అడుగులు

కొలిక్కిరాని జనగామ, నర్సాపూర్‌ నియోజకవర్గాల టికెట్ల పంచాయితీ

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జా­బి­­తా వెలువడి పది రోజులు దాటినా అసమ్మతి నేతలు మెత్తబడటం లేదు. టికెట్‌ దక్కించుకున్న నేతలు అసమ్మతి నేతల సహకారం కోరుతూ వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సానుకూలంగా స్పందించడం లేదు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఎక్కువ మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాగా ఇన్నాళ్లూ అధికార బలాన్ని ఉపయోగించి తమను తొక్కిపెట్టారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలతో తాము ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు సర్దుబాటుకు ససేమిరా అంటున్నారు.

మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో అంటకాగి పదవులు, పనులు పొందిన చోటా మోటా నేతలు కూడా ఏదో ఒక సాకు చూపుతూ ప్రస్తుతం దూరం పాటిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలోకి దిగాలనుకుంటున్న అభ్యర్థుల అడుగులు ముందుకు పడట్లేదు. ఆయా అభ్యర్థుల కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు అసమ్మతిని చల్లార్చేందుకు రాయబారం నెరపుతున్నా ఆశించిన ఫలితం రావట్లేదు.

చాలా నియోజకవర్గాల్లో బుజ్జగింపుల పర్వం వికటించి కిందిస్థాయి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నియోజకవర్గాలవారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బుజ్జగింపుల పర్వాన్ని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి తదితరులు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ దిద్దుబాటుకు ప్రయత్నిస్తున్నారు.  

సొంతదారి వైపు అసమ్మతి చూపు
ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం బీఆర్‌ఎస్‌లో సంచలనం సృష్టించగా టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు సొంత దారి చూసుకోవడంపై దృష్టిసారించారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేఖానాయక్‌ (ఖానాపూర్‌), వేముల వీరేశం (నకిరేకల్‌) పార్టీనీ వీడగా మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (పాలేరు) తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

తాము సైతం బీఆర్‌ఎస్‌ను వీడటం ఖాయమని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. పటాన్‌చెరు, జహీరాబాద్, మెదక్, కల్వకుర్తి, సంగారెడ్డి, అలంపూర్, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేట, రామగుండం తదితర నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు రద్దు చేసి తమకు కేటాయించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నెలకొన్న అసమ్మతి దిద్దుబాటుకు మంత్రి టి.హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి అసమ్మతి నేతలతో తన నివాసంలో వరుస భేటీలు జరుపుతున్నారు.

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ అభ్యర్థుల గెలుపు కోసం కలసికట్టుగా పనిచేయాలని కోరుతున్నారు. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాలకు చెందిన అసమ్మతి నేతలు శుక్ర, శనివారాల్లో హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఈ నెల 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్‌ రాక తర్వాత బుజ్జగింపుల పర్వం వేగం పుంజుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా పట్టాలెక్కుతుందని చెబుతున్నాయి.

జనగామ, నర్సాపూర్‌ పంచాయితీ యథాతథం
జనగామ, నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనపై నెలకొన్న సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), చిలుముల మదన్‌రెడ్డి (నర్సాపూర్‌) తమకు టికెట్‌ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ) తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

కేటీఆర్‌ వచ్చిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాలపై పీటముడి వీడే అవకాశముంది. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టికెట్‌ కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటంతో మధ్యేమార్గంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు తెరమీదకు వస్తున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు