గ్రామాలకు డబ్బు పంపండి

8 Dec, 2016 00:57 IST|Sakshi
గ్రామాలకు డబ్బు పంపండి

- బ్యాంకర్లను కోరిన మంత్రి ఈటల
- రైతులకు రూ.24 వేలు అందేలా చూడండి
- చిన్న నోట్లను అందుబాటులో ఉంచండి
- సీఎస్, బ్యాంకర్లతో సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు కావొస్తున్నా బ్యాంకుల వద్ద క్యూలు తగ్గలేదని.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నోట్ల రద్దు ప్రభావం, నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వివిధ బ్యాంకుల అధికారులతో మంత్రి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా ప్రతి పూట, ప్రతి రోజు పర్యవేక్షించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

అధికారులు, బ్యాంకర్లు సమష్టిగా కృషి చేసి వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేలా చూడాలన్నారు. పట్టణ ప్రజలకు బ్యాంకులు, డిజిటల్ చెల్లింపులపై కొంత అవగాహన ఉంటుందని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బ్యాంకు ముఖం చూడని వారుంటారని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ డబ్బు పంపిణీ చేయాలని బ్యాంకర్లను కోరారు. రూ.24 వేలు డ్రా చేసుకునేందుకు అనుమతించినా రైతులకు ఇవ్వటం లేదని, వారికి డబ్బు అందేలా చూడాలన్నారు. ప్రజల ఇబ్బందులు పోవాలంటే సరిపడేన్ని చిన్న నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

 ఏటీఎంల సంఖ్య పెంచండి
 నగదు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకర్లను ఈటల కోరారు. ఎక్కువగా స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తేవాలని, ఏటీఎంల సంఖ్య పెంచాలని కోరారు. నగదు రహిత విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయని, అందులో 70 లక్షల మంది రూపే కార్డులు తీసుకున్నారని వివరించారు. అందులో 46 లక్షల కార్డులు ఇప్పటికీ పని చేయటం లేదన్నారు. నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.15,583 కోట్ల నగదు రాష్ట్రానికి వచ్చిందని, అందులో 94 శాతానికి పైగా రూ.2 వేల నోట్లు ఉండటంతో చిల్లర సమస్య వచ్చిందన్నారు. అందుకే చిన్న నోట్లు కేటారుుంచాలని ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు