పోస్ట్‌ ద్వారా 2,000 నోట్ల మార్పిడి

3 Nov, 2023 06:30 IST|Sakshi

బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బు జమ

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానం అమలవుతోంది. పోస్ట్‌ ద్వారా ఈ మేరకు ప్రజలు సేవలు పొందవచ్చని ఇప్పటికే ప్రకటించిన ఆర్‌బీఐ ఉన్నతాధికారులు ఇందుకు వీలైన ప్రక్రియపై ప్రచారాన్ని చేపట్టారు. ఇన్సూర్డ్‌ పోస్ట్‌ లేదా టీఎల్‌ఆర్‌ (3 అంచెల రక్షణ) కవర్‌ను  వినియోగించుకుని సురక్షితమైన మార్గంలో రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఈ విధానంలో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారు బ్యాంక్‌ ఖాతాల్లో జమవుతుంది. ‘‘కస్టమర్‌లు రూ. 2,000 నోట్ల మార్పునకు సంబంధించిన డబ్బు తమ ఖాతాలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో ప్రత్యక్షంగా క్రెడిట్‌ కావడానికి వీలుగా ఇన్సూర్డ్‌ పోస్ట్‌ను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ విధానం నిర్దేశిత ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించడం, వరుసలో నిలబడ్డం వంటి ఇబ్బందుల నుంచి వినియోగదారుని నివారిస్తుంది’’ అని ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ రోహిత్‌ పి. దాస్‌ అన్నారు.

  చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. అక్టోబర్‌ 30వ  తేదీ నాటికి రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ రూ.2,000 డినామినేషన్‌ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దేశంలోని 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్‌ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.  రూ.2 వేల నోట్ల డిపాజిట్‌ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్‌ 7 వరకు అందించాయి. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేవలు 19 ఆర్‌బీఐ కార్యాలయాలకు మారాయి.

మరిన్ని వార్తలు