ఈ పోలీసులకు ఏమైంది..!

2 Mar, 2020 11:21 IST|Sakshi

వివాదాస్పదమవుతున్న ఖాకీలు

పలువురిపై క్రమశిక్షణ చర్యలు 

షాద్‌నగర్‌ సబ్‌ డివిజన్‌ పోలీసులపై ఉన్నతాధికారుల సీరియస్‌

సాక్షి, షాద్‌నగర్‌ : ‘దిశ’ కేసులో వారు వ్యవహరించిన తీరుకు ప్రజలు జేజేలు పలికారు. జనారణ్యంలోకి వచ్చిన పులిని ప్రాణాలకు తెగించి ఎవరికీ హాని జరగకుండా పట్టుకున్న ఘనత వారిది.. కిడ్నాప్‌ అయిన చిన్నారిని గంటల వ్యవధిలో తీసుకొచ్చిన సాహసం వారి సొంతం. కానీ, ఇటీవల జరిగిన ఘటనలతో విమర్శల పాలయ్యారు. ప్రజా రక్షణకు అంకిత భావంతో పనిచేసే పోలీసులు స్వతహాగా క్రమశిక్షణ దిశగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంఘటనలు సూచిస్తున్నాయి. షాద్‌నగర్‌ పరిధిలో ఇటీవల పోలీసులు చేసిన నృత్యాలు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. పట్టణంలో పోలీసులు ఏర్పాటు చేసిన విందులో కొందరు నృత్యాలు చేయడం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇది సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ దాకా వెళ్లడంతో సీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. షాద్‌నగర్‌ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌ను కమిషనరేట్‌కు అటాచ్‌ చేసిన సంగతి విధితమే. ఈ వివాదం సమసిపోకముందే.. ఇటీవల రామేశ్వరం శివారులోని తోటలో మద్యం సేవిస్తూ పోలీసులు చేసిన నృత్యాల జోష్‌ అంతా ఇంకా కాదు. ఈ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. దీనితో మరోసారి పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. వరుస ఘటనలతో వచి్చన విమర్శలు పోలీసులను ఊపిరాడనీయకుండా చేశాయి. ఈ సంఘటనలో కొత్తూరు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ బాలస్వామి, కానిస్టేబుళ్లు అశోక్‌రెడ్డి, అమర్‌రాథ్, చంద్రమోహన్, వెంకటేష్‌, హోంగార్డు రామకృష్ణలను సైబరాబాద్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేశారు. షాద్‌నగర్‌ సబ్‌డివిజన్‌లో ఏం జరుగుతుందని పోలీసు శాఖ ఆరాతీస్తోంది.

కొందరు కావాలనే వీడియోలను వైరల్‌ చేశారనే ఆలోచన పోలీసుల్లో ఉంది. కాగా, పోలీసుల్లో కూడా వర్గాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రామేశ్వరంలో జరిగిన విందులో పోలీసు శాఖకు సంబందించిన వ్యక్తులే ఉన్నారు. ఇతరులెవరూ లేరు. అలాంటçప్పుడు అక్కడ నృత్యాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎలా వైరల్‌ అయ్యిందన్నదే ప్రశ్న. వీడియోలు బయటికి ఎలా వెళ్లాయన్నది పక్కన పెట్టి.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. నిరంతరం ప్రజల కోసం శ్రమించే పోలీసులు ఇలాంటి సరదాలకు దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా