సింగూరుపైనే ఆశలు

11 Nov, 2014 23:40 IST|Sakshi
సింగూరుపైనే ఆశలు

జోగిపేట: సింగూరు.. జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టు. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జలాశయం. అంతేకాదు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం గలసాగునీటి వనరు. దీన్ని గుర్తించే 2006 జూన్ 7న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాల్వల నిర్మాణ  పనులకు శంకుస్థాపన చేశారు. 2 టీఎంసీల నీటిని సాగుకు మళ్లించి ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చాలని భావించారు.

ఇందుకోసం భారీగా నిధులు కేటాయించారు. అయితే వైఎస్సార్ అకాల మరణానంతరం ఈ ప్రాజెక్టుపై ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో సింగూరు నీరు రైతన్నలను ఊరిస్తూనే ఉంది. కానీ జిల్లా రైతుల సాగునీటి కష్టాలు బాగా తెలిసి మంత్రి హరీష్‌రావు సింగూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా చూడడంతో పాటు ఈ డిసెంబర్‌లో 10 వేల ఎకరాలను సింగూరు నీటితో తడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 లిఫ్ట్ ద్వారా నీరందించేందుకు  కసరత్తు
 ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు చాలా తక్కువగా  ఉన్నాయి. ప్రస్తుత నీటి మట్టంగా 518.891 మీటర్లు ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిర్ధారించారు. అందువల్ల ప్రస్తుతం ఈ నీళ్లను  నేరుగా గేట్లు తెరిచి పంట పొలాలకు పంపించడం వీలుకాదు. కాబట్టి ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేసి లిఫ్ట్ ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు  చేస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ ఆత్మరాం ‘సాక్షి’కి తెలిపారు. లిఫ్ట్ వద్ద  మోటార్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, రూఫ్‌షెడ్ వంటి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ శైలేంద్ర పనులను పరిశీలించారు.  ఏదైనా సరే డిసెంబర్ మొదటి వారం వరకు 10 వేల ఎకరాలను సింగూరు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 బడ్జెట్‌లో రూ.13 కోట్లు
 తెలంగాణ రాష్ర్టం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సింగూరు ప్రాజెక్టుకు రూ.13 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రైతులకు బకాయిగా ఉన్న రూ.5 కోట్ల పరిహారం పంపిణీ చేయనున్నారు. ఇక మిగిలిన నిధులతో కాల్వల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.  

 మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ
 జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టుగా ఉన్న ‘సింగూరు’ ద్వారా రైతులకు సాగునీరందించే విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి జూలై 21నమంత్రి హరీష్‌రావు, స్థానిక శాసనసభ్యుడు పి.బాబూమోహన్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే ఇరిగేషన్ శాఖ రాష్ట్రఅధికారులతో సమావేశమై రబీలో 10 వేల ఎకరాలకు, వచ్చే ఖరీఫ్ నాటికి 40వేల ఎకరాలకు సింగూరు నీరందిస్తామని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా