అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం

28 Jun, 2019 10:47 IST|Sakshi
చికిత్స పొందుతున్న కృష్ణవేణి , అనిత, మానస

నలుగురు యువతులు ఒకేసారి పురుగు మందు తాగిన వైనం

జడ్చర్ల మండలం చర్లపల్లిలో కలకలం రేపిన ఘటన

సాక్షి, జడ్చర్ల: నిరుపేద కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులు.. అంతా ఆడ సంతానం.. దీనికి తోడు కుటుంబ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆ ఆడపిల్లలు ఏమనుకున్నారో.. ఎంతగా మానసిక క్షోభకు గురయ్యారో.. తండ్రి పట్టించుకోవడం లేదనో.. తమకు పెళ్లిళ్లు కావడం లేదనో.. తెలియదు గాని వారు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.. ఈ సంఘటన మండలంలోని చర్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది.

గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెమోని వెంకటయ్య (65), సాయమ్మ (60) దంపతులకు ఆరుగురు కూతుళ్లు. వెంకటమ్మ అలియాస్‌ మానస (36), అనిత (34), కృష్ణవేణి (30), యాదమ్మ (27), మౌనిక అలియాస్‌ ప్రవళిక (25), స్వాతి (20) ఉన్నారు. వీరిలో మౌనిక బీఫార్మసీ పూర్తి చేయగా.. స్వాతి ఇంటర్‌ పూర్తి చేసింది. మిగతా వారు కూడా పదో తరగతిలోపు చదువుకున్నారు. అయితే గురువారం మానస, అనిత, కృష్ణవేణి, యాదమ్మలు ఇంట్లో ఉన్న పురుగు మందును తాగారు. అస్వస్థతకు గురవడంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆటోలో, ద్విచక్రవాహనంపై వారిని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో 108లో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. 

నిరుపేద కుటుంబం 
గ్రామానికి చెందిన వెంకటయ్యది నిరుపేద కుటుంబం. ఈయనకు భార్య సాయమ్మతో పాటు  తల్లి శాంతమ్మ, ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. తన స్థోమతకు తగ్గట్టుగా కూతుళ్లను చదివించాడు. వీరికి గ్రామ శివారులో ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో పండే పంటలతోపాటు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వెంకటయ్యతోపాటు మరో ఇద్దరు సోదరులకు కలిపి మూడు గదుల ఇళ్లు ఉంది. ఇందులో వెంకటయ్య పాలికి వచ్చిన చిన్నపాటి గదిలోనే వీరంతా జీవనం సాగిస్తున్నారు. ఆ గది కూడా చిన్నగా ఉండటం, శిథిలావస్థకు చేరుకుంది. 

అంతా పెళ్లీడు వారే.. 
ఆరుగురు ఆడపిల్లలు. అంతా పెళ్లీడు దాటిన వారే. దీంతో ఆ ఆడకూతుళ్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ తండ్రి వెంకటయ్య తమను పట్టించుకోవడం లేదని, తమకు పెళ్లిళ్లు చేయడం లేదన్న మానసిక వ్యథ ఒక వైపు కుంగదీస్తుండగా.. మరోవైపు పేదరికం అడుగడుగునా వెక్కిరించింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు పురుగు మందు తాగి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా బుధవారం తమ చెల్లెలు కృష్ణవేణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈమె ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటుందని వీరి అనుమానం. దీంతో తండ్రి వెంకటయ్య తన కూతురు కృష్ణవేణి కోసం యాదగిరిగుట్ట, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో వెతికేందుకు వెళ్లాడు. తమ చెల్లెలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తమ పరువు తీసిందని భావించారో.. మరో కారణంగానో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. 

25 ఏళ్ల క్రితం సర్పంచ్‌ 
వెంకటయ్య దాదాపు 25 సంవత్సరాల క్రితం చర్లపల్లికి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం బాదేపల్లి పట్టణం తదితర ప్రాంతాల్లో చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేపట్టి నష్టపోయినట్లు తెలిసింది. దీంతో ఒకవైపు ఆడపిల్లలు, మరోవైపు    పేదరికంతో  వెంకటయ్య మానసికంగా కుంగిపోయి మౌనస్థితికి చేరినట్లు అనుమానిస్తున్నారు. 

గతంలోనే పోలీసుల దృష్టికి.. 
తమను తమ తండ్రి వెంకటయ్య పట్టించుకోవడం లేదని, తమకు పెళ్లిళ్లు చేయడం లేదని, పెద్దదిక్కుగా ఉన్నా తండ్రి పట్టించుకోకపోవడంతో తమకు సంబంధాలు రావడం లేదని ఆవేదన చెందిన కూతుళ్లు తమకు న్యాయం చేయాలని కొద్దిరోజుల క్రితం జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఐ బాలరాజుయాదవ్‌ వారికి, తండ్రి వెంకటయ్యకు కౌన్సిలింగ్‌ నిర్వహించి ధైర్యంగా ఉండాలని చెప్పి పంపించారు. పెళ్లికి సహాయంగా తమవంతుగా సహకరిస్తామని కూడా సీఐ వారికి భరోసా ఇచ్చారు.

కేను నమోదు 
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజుయాదవ్‌ తెలిపారు. ఆరుగురు ఆడపిల్లలు, పెళ్లిళ్లు కాకపోవడం, వీరిలో ఒక చెల్లెలు ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోవడం కారణంగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో మానస, అనితల పరిస్థితి విషమంగా ఉండడంతో ఏనుగొండలోని ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరు కృష్ణవేణి, యాదమ్మలకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు.   

మరిన్ని వార్తలు