స్మార్ట్ విలే జ్ నిర్మించండి

1 Dec, 2014 03:19 IST|Sakshi
  • తెలుగు చిత్రసీమను కోరిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
  • సాక్షి, హైదరాబాద్: ‘‘సినీ పరిశ్రమ యావత్తూ ఒక్క తాటిపై నిలిచి స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమం చేపట్టింది. ‘మేము సైతం’ ద్వారా రూ.11,51,56,116 మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. ఈ మొత్తాన్నీ మీకే ఇచ్చేస్తాను. దీనికి సమానంగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తాం. ఆ మొత్తం డబ్బుతో హుద్‌హుద్ తో దెబ్బతిన్న పల్లెటూళ్లలో ఏదో ఒక పల్లెని మీరే ఎంచుకోండి. దాన్ని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దండి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు.

    వచ్చే అక్టోబర్ నాటికి తుపాను బీభత్సానికి ఏడాది పూర్తవుతుందని, ఆలోగా స్మార్ట్ విలేజ్‌ని పూర్తి చేయాలన్నారు. విరాళాలతో దాదాపు 8 వేల గృహాలను కట్టొచ్చని, తెలుగు సినీ పరిశ్రమ పేరు కలకాలం నిలిచిపోయేలా ఆ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు ఇందుకు చిత్రప్రముఖులు అంగీకారం తెలిపారు. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న విశాఖకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా  తెలుగు చిత్రసీమ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

    ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఈ శోభ చూస్తోంటే... మహనీయుడు నందమూరి తారకరామారావు గారు ప్రజల కోసం జోలె పట్టిన నాటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆ స్ఫూర్తి ఇప్పుడు మీలో కనిపిస్తోంది. తుపాను సైతం అసూయ పడేంత బ్రహ్మండంగా ఈ కార్యక్రమం చేశారు’’ అని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లోనూ విశాఖ ప్రజలు చూపించిన చొరవ చాలా గొప్పదన్నారు. భవిష్యత్తులో ఏ విలయం కూడా ఏమీ చేయలేనంత గొప్పగా వైజాగ్‌ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ‘‘తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలుగువారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. తెలుగు చిత్రసీమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలి’’ అని పేర్కొన్నారు.
     
    సంక్షోభంలోనే అవకాశాలు..

    కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిని తాను భయపడనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్షోభంలోనే అవకాశాలు ఉంటాయన్నారు. రాజధాని నిర్మాణం ఒకప్పుడు పెద్ద సమస్య అని, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు.
    విజయవాడను తెలుగువారు గర్వపడేలా రాజధానిగా తీర్చిదిద్దాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ‘‘నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మంచి ఫలితాలనిచ్చింది. దాని స్ఫూర్తిగా నేను ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’కి పిలుపునిచ్చాను. అది మంచి ఫలితాలను ఇస్తోంది. త్వరలో ‘స్మార్ట్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ముందుకెళ్తా. సింగపూర్, జపాన్ స్ఫూర్తితో ముందుకెళ్తే రానున్న 30, 40 ఏళ్లలో మనదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయం’’ అని అన్నారు.

    ఈ సందర్భంగా జెమినీ టీవీతోపాటు పలు వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు చంద్రబాబుకు విరాళాల చెక్కులు అందించాయి. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.5 లక్షల విరాళం ప్రకటించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్రసీమ తరఫున చిరంజీవి ముగింపు ప్రసంగం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందర్నీ అభినందించారు.
     
     

మరిన్ని వార్తలు