సామాజిక క్వారంటైన్‌

22 Mar, 2020 01:36 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు బంధువులు దూరం

రెండు వారాల తర్వాతే పలకరింపులు

శుభకార్యాలకు రావొద్దని ముందుగానే సమాచారం

హోం ఐసోలేషన్‌ను పట్టించుకోని కొందరు వ్యక్తులు

విదేశాల నుంచి వచ్చిన రెండ్రోజులకే బయటకి.. 

కొన్నేళ్ల కిందట... 
కేశవ్‌ అమెరికాకు పయనమవుతున్నాడు. అమెరికాలోనే ఎమ్మెస్‌ చేసిన అతనికి అక్కడి ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో కుటుంబం సంతోషంగా ఉంది. వెళ్లే ముందు ఓ గెట్‌ టు గెదర్‌ ఏర్పా టు చేయడంతో బంధువులంతా వచ్చారు. అతనికి శుభాకాంక్షలు చెప్పి దగ్గరుండి సాగనంపారు.

ప్రస్తుతం ఇలా..  
కోవిడ్‌ ప్రభావంతో అతని కంపెనీ 3 నెలల కోసం వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశం కల్పించింది. దీంతో అతను ఇండియాకు వచ్చేశాడు. రెండేళ్ల తర్వాత ఇంటికి రావడంతో ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేసి బంధువులను పిలిచారు. చాలామంది ఫోన్‌ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారే కానీ ఇంటికొచ్చి మాట్లాడినవారు ఒక్కరూ లేరు.

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా విదేశాల నుంచి కుటుంబ సభ్యులు రాగానే ఆ ఇంట్లో కొత్త కళ కనిపిస్తుంది. బంధువుల పలకరింపులు, విందులు, వినోదాలు, విహార యాత్రలు, శుభకార్యాలు.. ఇలా సందడే సందడి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేరు. విదేశాల నుంచి వచ్చిన వారి ఇంటికి వెళ్లడానికి బంధువులు జంకుతున్నారు. ఇదో విచిత్రమైన పరిస్థితి. గతంలో ఎప్పుడూ కనిపించనిది. విదేశాల నుంచి వచ్చినవారు కనీసం రెండు వారాలు (14 రోజులు) హోం క్వారంటైన్‌ కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఎవరిలోనైనా కోవిడ్‌ లక్షణాలుంటే అవి 14 రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. అందుకోసం కనీసం 2 వారాలు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరి నీ కలవకుండా ఇంట్లోనే విడిగా ఉండాలనేది దీని ఉద్దేశం. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్‌బారిన పడి గాంధీ ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా (ఒక్కరు మినహా) అలా విదేశాల నుంచి వచ్చి రెండు వా రాల్లో వైరస్‌ పాజిటివ్‌ లక్షణాలు కలిగినవారే. దీంతో ఇదే ఇప్పుడు అం దరిలో భయానికి కారణమవుతోంది. గత వారం రోజుల్లో హైదరాబాద్‌కు వివిధ దేశాల నుంచి 20 వేల మంది హైదరాబాదీలు రాగా రెండు వారాల తర్వాతే కలుద్దామన్న ‘ముందుజాగ్రత్త’తో బంధువులు వారికి దూరంగా ఉంటున్నారు.

పెళ్లిళ్లకు పిలుపు లేదు... 
మౌలాలికి చెందిన మధు (పేరు మార్చాం) 10 రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చాడు. అదే సమయంలో ఆయన మేనమామ కుమారుడి వివాహం ఉంది. కనీసం రెండు వారాలు హోం క్వారంటైన్‌గా ఉండాల్సి ఉన్నందున వేడుకకు ఆ కుటుంబాన్ని వారు దూరంగా ఉంచారు. మధు రావడానికి పూర్వమే ఆహ్వాన పత్రిక ఇచ్చినా తర్వాత ఫోన్‌ చేసి పెళ్లికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇంటి యజమాని అభ్యంతరం.. 
డేవిడ్‌రాజ్‌ (పేరు మార్చాం) ఓ వ్యాపారి. పనిపై ఆస్ట్రేలియా వెళ్లివచ్చాడు. 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు చెప్పారు. దీంతో ఆ యన ఇంటికే పరిమితమయ్యాడు. కానీ ఇంటి యజమాని అభ్యంతరం చెప్పాడు. 14 రోజులు మరోచోట ఉండాలని, ఆ పై రావాలని చెప్పాడు. దీంతో గ త్యంతరం లేక నగరంలో నే ఉంటున్న సోదరి ఇం టికి వెళ్లాల్సి వచ్చింది.

పెళ్లికి దూరం.. 
అల్వాల్‌లో ఉంటున్న వ్యక్తి కూతురి వివాహం 4 రోజుల క్రితం పెళ్లి జరిగింది. ముహూర్తం టైమ్‌కి పురోహితులు, రెండు కుటుంబాల వారు, కొందరు స్నేహితులు తప్ప బంధువులంతా మొహం చాటేశారు.అమ్మాయి సోదరుడు వారం క్రితం థాయ్‌లాండ్‌ నుంచి రావడమే ఇందుకు కారణం.

పట్టని వారూ ఉన్నారు.. 
విదేశాల నుంచి వచ్చిన వారిని చూసి ఓవైపు బంధువులు జంకుతుంటే 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులు రెండు రోజులకే ‘వీధికెక్కుతున్నారు’. విందులు, వినోదాలు, యాత్రలు సాగిస్తూ సాధారణ వ్యక్తుల్లాగే వ్యవహరిస్తున్నారు. ఇటీవల రైళ్లలో క్వారంటైన్‌ స్టాంపు ఉన్న వారిని తోటి ప్రయాణికులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ప్రయాణాలకు దూరంగా ఉండాలని దక్షిణమధ్య రైల్వే సూచించింది.

మరిన్ని వార్తలు