కొట్లాడి బతుకుదాం

23 Nov, 2014 23:50 IST|Sakshi
కొట్లాడి బతుకుదాం

Vip రిపోర్టర్ సోలిపేట రామలింగారెడ్డి

సోలిపేట రామలింగారెడ్డి... నక్సలైటుగా తుపాకీ ఎత్తినా..! జర్నలిస్టుగా కలం పట్టినా... ఎమ్మెల్యేగా శాసనసభలో గళం విప్పినా.. ఆయన ఎప్పుడూ పేదల పక్షపాతే. అణగారిన వర్గాల ప్రతినిధే. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మళ్లీ జర్నలిస్టు అయ్యారు. ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారి ఆదివారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని చేనేత కాలనీ, చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం కార్యాలయంలో కలియ తిరిగారు.

మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికులను పలకరించారు. నరాలను దారాలు చేసి బట్ట నేస్తున్న నేతన్నల కష్టాన్ని స్వయంగా చూశారు. నేతన్న గుండెలోతుళ్లో దాగి ఉన్న దుఃఖాన్ని తడిమారు. రోజురోజుకూ ‘పోగు’బంధం బలహీన పడటానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీకు న్యాయం జరక్కపోతే...మీ తరఫున పోరాడటానికి నేను సిద్ధం’ అంటూ  హామీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత తనను మళ్లీ జర్నలిస్టును చేసిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు చెప్పారు.

తెలంగాణ కోసం చేనేతలు ఉద్యమాలు చేసిండ్రు.. ఇక్కడి యువకుడు వంగ శేఖర్ ఆత్మత్యాగం చేసి  అమరుడు అయ్యాడు. మీ హక్కులను పోరాడి సాధించుకోవడం మీకో లెక్కా?  మీ పింఛన్ కట్  అయినా, మీకు అన్యాయం జరిగినా,  మీ తరఫున నేను పోరాడతా. డిమాండ్ చేయండి... కొట్లాడండి. చావుతో సమస్య పరిష్కా రం కాదు. మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు. ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో నిలబడి కలబడిబతకాలి.

-సోలిపేట రామలింగారెడ్డి
 
రామలింగారెడ్డి: ఇన్నేళ్ల నుంచీ చేనేత రంగం అభివృద్ధి చెందక పోవటానికి కారణం ఏమిటి?
బోడ శ్రీనివాస్: చేనేతను, టెక్స్‌టైల్స్‌ను ఈ రెండింటిని ప్రభుత్వాలు ఒకే గాటున పెట్టి చూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే నిధులల్లో 90 శాతం నిధులు టెక్స్‌టైల్స్‌కు ఇస్తుంటే, మాకు ఇచ్చే నిధులు మాత్రం నామమాత్రంగా ఉంటున్నాయి.

ప్రజలకు అవసరమైన బట్టలు చేనేతలు తయారు చేయలేకపోతున్నారు. పెద్దపెద్ద కంపెనీలు నేరుగా స్పిన్నింగ్ మిల్ నుంచి యారం(దారం) అర్డర్ చేసి దిగుమతి చేసుకుంటున్నాయి. వారు తయారు చేసిన బట్టను మార్కెట్‌లో అమ్ముకోవటానికి సకల సౌకర్యాలు ఉన్నాయి. మా దగ్గర అంత పెట్టుబడి లేదు. మా బట్టకు మార్కెట్‌లేదు. మా బతుకులకు మార్పులేదు. ఈ సర్కారును పెట్టుబడి పెట్టి చూడమని చెప్పండి..60 గజాల చీరను అద్దం లెక్కన నేసి అగ్గిపెట్టెలో మలిచి  పెట్టి ఇయ్యకుంటే సూడురి.

రామలింగారెడ్డి: దుబ్బాక చేనేత అంటేనే ఆత్మహత్యల అడ్డా  అంటారు.. నిజానికి ఇక్కడ ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు?
ఆలేటి కృష్ణహారి: ఆత్మహత్యలు నిజమే సార్.. ఎంత మంది అంటే ఏం జెప్పను సారు.. మొన్ననే  వయిట్ల కేశాలు సచ్చిపోయే.. ఆళ్లిట్లోనే సీనివాసులు పోయెనా..!  అంతకు మందే ఆలేటి భిచ్చపతి సచ్చిపోయే.. ఈ మధ్యనే గుండ్ల రాజేశం ఎళ్లిపోయే... ఎంత మందని సెప్పాలే సారు.  ఈ సావులు ఇన్నాటియా సారు. నాకు యాదున్నంత వరకు 250కి పైనే సచ్చిపోయిండ్రు. ఈ సావులు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినయి.

రామలింగారెడ్డి: ఆప్కో ద్వారా ప్రభుత్వమే మీ బట్టలు కొనుగోలు చేస్తుందని గతంలో చెప్పారు కదా?
చీర్ల రఘుపతి: మా ముందటి తరపోళ్లు (ముందు తరం) బట్టనేసి  కూసున్న కాన్నే  అమ్ముకునేటోళ్లు. అప్పుడు రేషానికి, యారంకు ఇంత ధరలు ఎక్కడియి. ఆల్‌మగలు మూడు దినాలు  కట్టపడితే  నూరు రూపాయిలు (రూ.100) దొరికేటియి. ఇప్పుడు మిల్లు బట్టలొచ్చే... ఎక్కడ పడితే  సింథటిక్  బట్టలు పెట్టి అమ్ముతుండురి. ఇగ మా  బట్టలు కొనేటోళ్లే లేకపోయిరి. ఆప్కో ఆదుకుంటదీ...ఆప్కో ఆదుకుంటది అని జెప్పిరి కానీ ఆప్కో రాలే నా గీప్కో రాలే. మా బతుకులు కుక్కకంటే హీనం. చంద్రశేఖర్‌కు(కేసీఆర్) అన్ని తెలుసు. ఇక్కన్నే సదువుకున్నోడు. ఆయన మా బతుకుల మీద ఆలోచన జేస్తే బత్తం.. లేకుంటే సత్తం.

రామలింగారెడ్డి: మగ్గం పని మీద రోజుకు ఎంత కూలి వస్తుంది?
నాగభూషణం: ఎంత కష్టంజేసినా రోజుకు రూ.100 మించి కూలి పడదు. సొంతంగా నేసుకుందామంటే పెట్టుబడి లేదు. మగ్గం నేస్తున్న ప్రతొక్కరికి రోజుకు రూ.200... రూ.300 కూలీ పడితేనే  మేం బత్తం లేకుంటే మళ్లా ఆత్మహత్యలు, ఆకలి చావులు స్టార్లు అయితయి. దుబ్బాకంతా స్మశానం అయింతది.

రామలింగారెడ్డి: సచ్చి ఏం సాధిస్తారే ? చనిపోయిన వారి పిల్లల బాధలు చూస్తున్నారు కదా?
తుమ్మ వెంకట్రాజం: ఈడు మీదున్నొళ్లు పని జేస్తెనే  రోజుకు రూ.50... రూ.60ల పనైతది, ఎంత జేసినా రూ.100 లోపే పనైతది. అగజూడు... నేను ఇప్పుడు 65 ఏండ్లుంట. నేను నేస్తే కాదు. ఎంత జేసినా నాకు రూ.40 కూడా పడవు. మందులకు నెలకు రూ.2 వేలు మించిపోతన్నయి. ఇగనేను  ఉరేసుకొనో....మందు మింగో సావుకపోతే బతికి ఏమన్నా ఫాయిదా ఉందా లింగన్న.

రామలింగారెడ్డి:  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరు అంటున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ దగ్గర ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా?
బోడ శ్రీనివాస్: మేం రెండు రకాల బట్టలు తయారు జేస్తున్నం. ఒకటి షర్టింగ్... ఇంకోటి బెడ్ షీట్లు. ప్రస్తుతం మేం షర్టింగ్ చేస్తే మీటర్‌కు రూ.48 ఉంటది. దీంతోటే చేనేతకు కూలీ రూ.14 ఇస్తరు. మేం ఎంత కష్టపడినా నాలుగైదు మీటర్లకు   మించి నేయలేము. ఈ లెక్కన మాకు పడేది రూ.56 నుంచి రూ.70 వరకే. అదే ప్రభుత్వం ప్రోత్సహించి లెనిన్ షర్టింగులు మాతో నేపిస్తే... దానికి మీటర్‌కు రూ.500 పడుతది. వీవర్ కూలీ రూ.50 ఇస్తరు. ఈ లెక్కన రోజుకు ప్రతి చేనేతకు రూ.300 వరకు పడే అవకాశం ఉంది. మేం సంఘం తరఫున షాంపిల్ కింద రూ.10 లక్షలు పెట్టి లెనిన్ బట్ట నేసినం. అప్పుడు నెలకు రూ.8 వేలు, రూ.9 వేలు వరకు గిట్టుబాటు అయింది.

రామలింగారెడ్డి: ఆత్మహత్య చేసుకున్న వారి పిల్లల పరిస్థితి ఏమిటీ?
లావణ్య: ఏముందు సారూ...నా మొగడు  చేనేత సంఘపొళ్లకు నేను రేపు చస్తానని మరీ చెప్పి రంగుల్లో కలిపే నట్రేట్ తాగి  సచ్చిపోయిండు. అప్పులోళ్ల బాధలకు ఏగలేకనే నట్రేట్(నైట్రేట్) తాగిండు. కూతురు పెళ్లి కోసం ఉన్న ఇళ్లు అమ్ముకున్నా అప్పులు తీరలేదు.  ఇళ్లుకొన్నొళ్లు ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నరు. అప్పులోళ్ల బాధలెక్కువయ్యాయి.. చేనేత సంఘ సభ్యులు కలిసి చందాలు చేసి అంత్యక్రియలు చేశారు. అద్దె ఇంట్లోనే ఉంటున్నా.

వైట్ల శ్రీనివాస్ భార్య లావణ్య: మగ్గానికయ్యే పెట్టుబడుల కోసం అప్పులు చేసిండు. అప్పులోళ్లు రోజు  ఇబ్బంది పెడుతుంటే  అప్పులు  తీర్చే మార్గం లేక నైట్రేట్‌ను మింగి ఇద్దరు చిన్న కూతుళ్లను విడిచి వెళ్లిండు. బతకడమే భారమవుతోంది.
 
వీరబత్తిని శ్రీనివాస్ భార్య బాలమణి : అప్పులు తీర్చే మార్గం లేక నైట్రేట్‌ను రెండేళ్ల కిందమింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఉండడానికి కనీసం ఇళ్లు కూడా లేదు. ఒకనొక కూతురు రేవతి (9) సాకడమే కష్టమవుతోంది. కనీసం వితుంతువు పెన్షన్ కూడా రావడం లేదు. అద్దె ఇంట్లోనే దుర్భర జీవనాన్ని గడుపుతున్నా.

>
మరిన్ని వార్తలు