త్వరలో చేనేత రుణ మాఫీ

31 Oct, 2017 02:20 IST|Sakshi

సత్వరమే ప్రక్రియ పూర్తి చేయండి

అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: చేనేత కార్మికుల రుణ మాఫీ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుల రుణ మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.10.5 కోట్ల నిధులు విడుదల చేసిందని, 2,500 మంది కార్మికులు రుణ మాఫీ ద్వారా లబ్ధిపొందనున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీమేరకు ప్రతి కార్మికుడు రూ.లక్ష వరకు రుణ మాఫీకి అర్హుడని వెల్లడించారు.

చేనేత, జౌళి శాఖ పథకాలు, కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల జాబితా రూపకల్పన సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. చేనేతతోపాటు పవర్‌లూం కార్మికులకు ఉమ్మడిగా రుణాలు మాఫీ చేసే కార్యక్రమాన్ని తొలిసారిగా రాష్ట్రంలో అమలు చేయబోతున్నామన్నారు. యార్న్, రసాయనాలు, డైల కొనుగోళ్లకోసం చేనేత కార్మికులకు రాయితీల చెల్లింపులో పురోగతిని సైతం మంత్రి సమీక్షించారు.

ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశామని అధికారులు మంత్రికి తెలియజేశారు. నవంబర్‌ తొలివారం నుంచి ఈ రాయితీల పంపకాలను ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి రంగానికి ప్రకటించిన రాయితీలు నేరుగా కార్మికులకు అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు 40 శాతం, పవర్‌లూం కార్మికులకు 10 శాతం వరకు రాయితీలను పెంచామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్రంలో చేనేత కార్పొరేషన్, పవర్‌ లూం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రెండు కార్పొరేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, చేనేత విభాగం డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌లను ఆదేశించారు. ఈ కార్పొరేషన్లకు ప్రభుత్వం కార్పస్‌ ఫండ్‌ కేటాయిస్తుందన్నారు. గద్వాల్‌లో నిర్మించతలపెట్టిన చేనేత పారిశ్రామికవాడపై సైతం మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ఆధునిక లూమ్‌ ఉత్పత్తిదారులు, పవర్‌లూం కార్మికులతో సిరిసిల్లలో నవంబర్‌ 18న మెగా పవర్‌లూం అప్‌గ్రెడేషన్‌ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 2018లోగా లూమ్‌ అప్‌గ్రెడేషన్‌ పూర్తి కానుందని తెలిపారు.

మరిన్ని వార్తలు