ఓయూలో సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్‌

24 Jan, 2019 01:58 IST|Sakshi

ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు మూడ్రోజుల పాటు కార్యక్రమాలు

ఓయూ చరిత్ర విభాగానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ భారతదేశ చరిత్ర మహాసభలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానుంది. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు ఈ సభలు నిర్వహించేందుకు వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఓయూలోని చరిత్ర విభాగానికి వందేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్‌ (ఎస్‌ఐహెచ్‌సీ) నిర్వహణకు నిర్ణయించారు. ఈ మహాసభల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్రతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, పరిపాలన సంస్కరణలు, సంస్కృతి సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం తదితర అంశాలపై చర్చలు, పరిశోధనా పత్రాలను ప్రతినిధులు సమర్పించనున్నారు. ప్రతిష్టాత్మకంగా మూడ్రోజులు నిర్వహిస్తున్న ఈ సభలకు దేశ, విదేశాల నుంచి చరిత్ర విభాగం అధ్యాప కులు, పరిశోధకులు 2వేలమంది హాజరుకానున్నట్లు ఎస్‌ఐహెచ్‌సీ కార్యదర్శి ప్రొ.అర్జున్‌రావు తెలిపారు. 

తెలంగాణ చరిత్రపై స్పెషల్‌ ఫోకస్‌.. 
దక్షిణ భారతదేశంలో తెలంగాణ కొత్తరాష్ట్రం కావడంతో ఈసభల్లో తెలంగాణ ఉద్యమం, ప్రాచీన, ఆధునిక చరిత్ర, మలిదశ తెలంగాణ ఉద్యమం, విజయం, రాష్ట్రావతరణ, అనంతర పరిస్థితులు, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. 

స్మారక ఉపన్యాసాలు.. 
మహాసభల్లో స్మారక ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రొఫెసర్లు రామచంద్రన్, బీసీ రాయ్, కస్తూరి మిశ్రాలపై స్మారక ఉపన్యాసాలుంటాయి. మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ రాత్రి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఓయూ క్యాంపస్‌లోని ఠాగూర్‌ ఆడిటోరియంలో మహాసభల అనంతరం దూరవిద్య కేంద్రం సమావేశ మందిరాల్లో టెక్నికల్‌ సెషన్స్, 500 పరిశోధనా పత్రాల సమర్పణ ఉంటుందన్నారు. ఈ పత్రాలను ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్ర రచనా పద్ధతితో పాటు సముద్రాల వాణిజ్య చరిత్రపై పరిశోధనలు రాసి sihcgeneralsecretary@ gmail.com  ఈ–మెయిల్‌కు పంపాలి. మహాసభలకు హాజరయ్యేవారు ఫిబ్రవరి 7న ఆర్ట్స్‌ కాలేజీలో సాయంత్రం 4 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. వివరాలకు 9849415593 లేదా www.southindianhistorycongress.org/sihc వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చన్నారు.  

మరిన్ని వార్తలు