గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు తీర్పుపై ఆందోళన.. TSPSCని తక్షణమే ప్రక్షాళన చేయాలని నిరసనలు

23 Sep, 2023 14:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేసిన దరిమిలా.. TSPSC బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్తామని బోర్డు ప్రకటించినప్పటికీ.. అభ్యర్థులు శాంతించడం లేదు. పరీక్షలో బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడం అనే కారణంతోనే రెండోసారి పరీక్షను రద్దు చేస్తూ.. తిరిగి నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. దీంతో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ బోర్డుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

గ్రూప్‌-1 రద్దు పై ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఉద్యోగాభ్యర్థుల జీవితాలతో  ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా పరీక్షలు నిర్వహించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో.. ముందస్తుగా ఓయూ దారులను మూసేశారు అధికారులు. 

డీకే అరుణ ఫైర్‌
TSPSC గ్రూప్‌-1 పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్‌ చేస్తున్నారు. ‘‘ప్రభుత్వానికి నిరోద్యోగ యువత పట్ల చిత్తశుద్ధి లేదు. మద్యం నోటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ.. ఉద్యోగ నోటిఫికేషన్‌పై లేదు. బయోమెట్రిక్‌ విధానం పెడితే ఖర్చు అవుతుందని కక్కుర్తి పడడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మద్యం నోటిఫికేషన్‌ తప్ప.. ఏ నోటిఫికేషన్‌ సక్రమంగా జరగలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌.. పరీక్షలు నిర్వహించే విధానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. TSPSCని వెంటనే ప్రక్షాళన చేయాలి. చైర్మన్‌ ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి అని డీకే అరుణ డిమాండ్‌ చేస్తున్నారు. 

సీఎం కేసీఆర్‌ స్పందించాలి: NSUI వెంకట్
గ్రూప్ 1 రద్దు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎన్‌ఎస్‌యూఐ నేత బాల్మూరి వెంకట్‌ తెలిపారు. ‘‘ టీఎస్పీఎస్సీ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.  గ్రూప్ 1 లో, బయోమెట్రిక్ విధానం లేకపోవడం,అవకతవకలు జరిగాయని హైకోర్టు భావించి రద్దు చేసింది.  ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి.  విద్యార్థులు మనోధైర్యం కోల్పోరాదు. సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించి.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు యధావిధిగా  నిర్వహించాలి.   అలా చేయకపోతే మంత్రులను అధికారులు ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతాం.  వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్వాలిఫై అయిన  అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తాం . గ్రూప్ 1 రద్దుతో ఆందోళన చేస్తున్న విద్యార్థులది న్యాయపోరాటం అని పేర్కొన్నారు వెంకట్‌.

మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ ఈ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. లీకేజీ ఆరోపణలతో నేపథ్యంలో కిందటి ఏడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తొలిసారి రద్దయింది. ఈ ఏడాది జూన్ 11న రెండోసారి పరీక్ష జరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం.. హాల్‌ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ తాజాగా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు