పోటెత్తిన గుండెకు అండగా

23 Jul, 2019 01:35 IST|Sakshi

గుండెపోటు మరణాల నివారణకు ప్రత్యేక అంబులెన్సులు

ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి.. 

అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేకంగా తయారీ 

అనుబంధంగా జిల్లా ఆసుపత్రుల్లో కేతలాబ్‌ యూనిట్లు 

30 అంబులెన్సులను సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ఆకస్మికంగా గుండెపోటు వస్తే తక్షణం వైద్యం అందక రాష్ట్రంలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. 108 అత్యవసర అంబులెన్సులున్నా వాటిల్లో అత్యాధునిక సదుపాయా లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాల రేటు అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ‘స్టెమీ’ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అకస్మాత్తుగా గుండెపోటు రావడాన్ని ఎస్టీ–ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (స్టెమి) అంటారు. అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్సులు, ఇతరత్రా సదుపాయాలు కల్పించడమే ఈ అంబులెన్స్‌ ఉద్దేశం. ఈ అంబులెన్సులను ఆగస్టు 15న ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 30 అంబు లెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆకస్మికంగా గుండెపోటు వచ్చిన రోగిని బతికించేందుకు దేశంలో పలుచోట్ల ‘జాతీయ స్టెమీ కార్యక్రమం’ నడుస్తోంది. తమిళనాడులో ప్రస్తుతం ఇది పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతోంది. ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద దీనికి కేంద్రం నిధులు రానున్నాయి. 

చేయి దాటుతోంది.. 
దీర్ఘకాలం గుండెలో రంధ్రాలు మూసుకొని పోయి ఉండటం వల్ల ఒకేసారి తీవ్రమైన గుండెపోటు వస్తుంది. ఈ పరిస్థితినే స్టెమీ అంటారు. ఇలాంటి సందర్భంలో ప్రతి క్షణం అత్యంత కీలకమైంది. స్టెమీ అనే తీవ్రమైన గుండెపోటు వచ్చిన వారు చనిపోవడానికి ప్రధాన కారణం ఆసుపత్రికి తీసుకెళ్లేంత సమయం ఉండకపోవడం, రవాణా సదుపాయాలు లేకపోవడం.. అంతేకాదు సాధారణమైన ప్రాథమిక స్థాయి ఆసుపత్రుల్లో తీవ్రమైన గుండెపోటు గుర్తించే పరిస్థితి లేకపోవడమేనని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. సాధారణ అంబులెన్సుల్లో తీవ్రమైన గుండెపోటుకు తీసుకోవాల్సిన ప్రత్యేక వ్యవస్థ ఉండదు. ఆక్సిజన్‌ ఇచ్చి సాధారణ వైద్యం చేస్తూ సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి మాత్రమే అవి పనికొస్తున్నాయి. దీనివల్ల ఈ అంబులెన్సులు రోగిని తీసుకెళ్లేందుకు వచ్చినా ప్రాణాలు కాపాడటం సాధ్యం కావట్లేదు.  

అత్యాధునిక సదుపాయాలు.. 
స్టెమీ అంబులెన్సులు ఆకస్మిక గుండె పోటును నివారించేందుకు ఉపయోగపడతాయి. అందులో కేతలాబ్‌లో ఉండే అన్ని రకాల అత్యాధునిక వసతులు ఉంటాయి. ఈసీజీ రికార్డు చేయడం, గుండె చికిత్సకు అవసరమైన ప్రొటోకాల్‌ వ్యవస్థ ఉంటుంది. అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టుతో వైద్యం అందుతుంది. ఈ అంబులెన్సులను ఆకస్మికంగా గుండెపోటు వచ్చిన వారి కోసమే పంపుతారు. 108 అత్యవసర వాహనాలకు స్టెమీని అంబులెన్సులను అనుసంధానం చేస్తారు. స్టెమీ అంబులెన్సులతో పాటు ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కేతలాబ్‌ను ఏర్పాటు చేస్తారు. దానివల్ల రోగిని ఏదో ఆసుపత్రికి కాకుండా కేతలాబ్‌కే తీసుకెళ్లడానికి వీలుంటుంది. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే స్టెమీ అంబులెన్సులను ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో 19 శాతం ఆకస్మిక గుండె మరణాలను తగ్గించగలిగారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు