పర్యాటక ప్రయాణమెలా?

13 Mar, 2019 11:13 IST|Sakshi

త్వరలో వేసవి సెలవులు  

టూర్లకు వెళ్లనున్న సిటీజనులు  

అందుబాటులో అరకొర రైళ్లే..   ప్రత్యేక రైళ్లు తక్కువే..  

రెగ్యులర్‌ రైళ్లలో ఇప్పటికే వెయిటింగ్‌ లిస్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో పిల్లలకు సెలవులు రానున్నాయి. వేసవి సెలవుల్లో పర్యాటక ప్రాంతాలు, సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో మాత్రం ఇప్పటికే వెయిటింగ్‌ లిస్టు   దర్శనమిస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. కానీ వాటిలో హైదరాబాద్‌ నుంచి వెళ్లేవి తక్కువే. నగరం నుంచి పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. నగరం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఎక్కువ శాతం కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉత్తరాదికి వెళ్లే రైళ్లు చాలా తక్కువ. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించేందుకు వెళ్లాలనుకున్నా  కష్టమే. మరోవైపు ప్రత్యేక రైళ్లలో చాలా వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు. కొన్ని 15 రోజులకు ఒకసారి రాకపోకలు సాగించేవి ఉన్నాయి. ఈ రైళ్లకు అనుగుణంగా ప్రయాణించేవాళ్లకు మాత్రమే కొంత మేరకు ఊరట లభిస్తుంది. పైగా  ప్రత్యేక రైళ్లలోనూ చాలా వరకు ఇప్పటికే బుక్‌ అయ్యాయి. మరిన్ని అదనపు రైళ్లు, అదనపు బెర్తులు, బోగీలు  వేస్తే తప్ప ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయడం సాధ్యం కాదు. 

‘వెయిట్‌’ చేయాల్సిందే...  
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్‌ రైళ్లన్నింటిలోనూ వెయిటింగ్‌ లిస్ట్‌ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొన్ని రైళ్లలో 80 వరకు నమోదై ఉండగా, మరికొన్నింటిలో 100కు పైగా దాటిపోయింది. ఏప్రిల్, మే నెలల్లోనే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. జూన్‌ మొదటి వారంలో తిరిగి నగరానికి చేరుకుంటారు. కానీ అన్ని రైళ్లలోనూ డిమాండ్‌ అనూహ్యంగా కనిపిస్తోంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో సుమారు 90 అదనపు రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందించింది. మార్చి నుంచి జూన్‌ వరకు వారానికి ఒకసారి రాకపోకలు సాగించే విధంగా వీటిని నడుపుతారు. రెగ్యులర్‌ రైళ్లలో వెయిటింగ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లలో వెళ్లాలనుకున్నా ఎప్పుడు బయలుదేరుతుందో తెలియని ట్రైన్‌ కోసం పడిగాపులు కాయాల్సిందే. 

ఢిల్లీకి కష్టమే...  
వేసవి సెలవుల దృష్ట్యా చాలామంది నగరవాసులు ఉత్తరాది పర్యటనకు ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా డిల్లీ కేంద్రంగా వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. కానీ హైదరాబాద్‌ నుంచి  ఒక్క తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ మినహా ఇతర రైళ్లు లేవు. కొన్ని రైళ్లు మాత్రం ఏపీ నుంచి, బెంగళూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో చాలా వరకు వైజాగ్, విజయవాడ, బెంగళూర్‌లలోనే భర్తీ అవుతాయి. అలాగే సికింద్రాబాద్‌ నుంచి జైపూర్, పట్నాకు వెళ్లే రైళ్లు కూడా చాలా తక్కువ. సికింద్రాబాద్‌–పట్నా మధ్య భారీ ఎత్తున రాకపోకలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నవాళ్లు ఈ వేసవిలో సొంతూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. కానీ అందుబాటులో ఉన్న రైలు మాత్రం ఒక్కటే. ఏదో విధంగా వెళ్లాలంటే కనీసం రెండు, మూడు రైళ్లు మారాల్సిందే. హైదరాబాద్‌ నుంచి  ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉన్న మరో పుణ్యక్షేత్రం షిర్డీ. ఒకే ఒక్క రైలు సికింద్రాబాద్‌ నుంచి షిర్డీకి వెళ్తుంది. మరో ట్రైన్‌ కాకినాడ నుంచి బయలుదేరి సికింద్రాబాద్‌ మీదుగా వెళ్తుంది. ఇక కేరళలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌ ఒక్కటే ఉంది. 

మరిన్ని వార్తలు