నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి 

4 Feb, 2020 04:51 IST|Sakshi

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాజేంద్రనగర్‌: నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రస్తుతం నియామకాలపై సర్కారు దృష్టిసారించిందని తెలిపారు. కిస్మత్‌పూర్‌లోని ఎక్సైజ్‌ అకాడమీలో 284 మంది ఎక్సైజ్‌ ఎస్సైలకు సోమవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన అధికారులు అంకితభావంతో శిక్షణ పూర్తి చేయాలని సూచించారు.

గుడుంబా రహిత రాష్ట్రంగా చేయడంతో పాటు గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నీరాను అందుబాటులోకి తేనుందని చెప్పారు. ఈత, తాటిచెట్లను పెంచే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. మరో 20 ఏళ్లు కేసీఆర్‌ నాయకుడని, ఆ తర్వాత కేటీఆర్‌ తమ నాయకుడని శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, వచ్చిన వారు ప్రజలకు మంచి జరిగేలా చూడాలన్నారు. అనంతరం ఎక్సైజ్‌ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు