పోలింగ్‌ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..

30 Nov, 2023 07:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఏజెన్సీ(సమస్యాత్మక) ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఇక, పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే బూత్‌ల వద్దకు ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక, సినీ ప్రముఖులు మాత్రం ఉదయమే ఓటు వేశారు. 

►హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రాస్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ప్రశాంతంగా పోలింగ్‌ మొదలైంది. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

►కాంగ్రెస్‌ నేత పొంగులేటి సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని నారాయణపురంలో ఆయన ఓటు వేశారు. 

►మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

►ఎమ్మెల్సీ కవిత కూడా ఓటు వేశారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశ ప్రగతి కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ముఖ్యంగా యూత్‌ తప్పకుండా ఓటు వేయాలన్నారు.

►నటుడు అల్లు అర్జున్‌ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లో బన్నీ ఓటు వేశారు. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

►తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు హీరో సుమంత్‌ బూత్‌కు వెళ్లారు. 

►ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి, స్టేట్‌ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి. బర్కత్‌పురాలోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు విలువైనది, పవిత్రమైనది. ప్రజలంతా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 

►ఇక, నిజామాబాద్‌ ఆదర్శ మహిళా పోలింగ్‌ కేంద్రం పవర్‌ కట్‌. దీంతో, పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

►కాగా, పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే జూబ్లీహిల్స్‌ టెలిఫోన్‌ ఆఫీసులోని 153 పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం మొరియించింది. 

►పలుచోట్లు ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. 

►నిర్మల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. ఎల్లపెల్లిలో ఆయన ఓటు వేశారు. 

►ఎస్‌ఆర్‌ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు ప్రకాశ్‌ రాజ్‌

►కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేసిన ఎన్టీఆర్‌ సహా కుటుంబ సభ్యులు.

►మెదక్‌ జిల్లా ఎల్లాపూర్‌లో ఈవీఎం మొరాయింపు కారణంగా ఇంకా ప్రారంభం కాని ఓటింగ్‌. 

►ఖమ్మంలోని సత్తుపల్లి మండంలో రామగోవిందపురం, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఉమెన్‌ కాలేజీలో మొరాయించిన ఈవీఎంలు, ఇంకా ప్రారంభం కాని పోలింగ్‌. 

►నిజామాబాద్‌లోని దస్తురాబాద్‌ మండలం పెరుకపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు. 

►ఓటు వేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు