‘స్వైన్’పై పోరుకు సర్వసన్నద్ధం: కేసీఆర్

24 Jan, 2015 03:00 IST|Sakshi
‘స్వైన్’పై పోరుకు సర్వసన్నద్ధం: కేసీఆర్

ఏ సమస్యనైనా ఎదుర్కొనేలా వైద్యారోగ్య శాఖను తీర్చిదిద్దుతాం
ప్రజల్లో ముందుగా అవగాహన కల్పించేందుకు చర్యలు
స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరికరాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం
కేంద్ర బృందంతో సమావేశంలో ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్: వైద్యపరమైన సమస్యలు, సంక్షోభాలు వచ్చినప్పుడు హడావుడి చేయడం కాకుండా... ఏ సమయంలో ఏం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖను తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రుతువులను బట్టి ప్రజలు పలు రకాల రోగాలకు గురవుతున్నారని, నీరు, ఆహారం కలుషితం కావడం ద్వారానే అవి వ్యాపిస్తున్నాయని వ్యా ఖ్యానించారు.

రాష్ట్రంలో ‘స్వైన్‌ఫ్లూ’ విజృంభిస్తుండడంతో పరిశీలన జరిపి, సలహాలు సూచనలివ్వడానికి వచ్చిన కేంద్ర బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిసింది. తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సమస్య వచ్చినప్పుడు హడావుడి చేసి, ఆ తరువాత పట్టించుకోలేదని విమర్శించారు. ఏ కాలంలో ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకునే విధంగా వైద్య ఆరోగ్య శాఖను సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఏయే కాలాల్లో ఏయే వ్యాధులు ప్రబలుతాయోనన్న అంశంపై ప్రజల్లో ముందుగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించి సాయం అందించడంతోపాటు వైద్య బృందాన్ని పంపినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘స్వైన్‌ఫ్లూ’ నిర్ధారణకు అవసరమైన పరికరాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కార్పొరేట్ ఆసుపత్రులు కూడా సామాజిక బాధ్యత పంచుకోవాలన్నారు. కేంద్ర బృందంతో సమావేశం జరుపుతున్న సమయంలోనే కేంద్రమంత్రి నడ్డాకు సీఎం కేసీఆర్ ఫోన్‌చేసి మాట్లాడారు. మరోసారి వైద్యు ల బృందాన్ని పంపించాలని, అన్ని జిల్లాల్లో నూ పర్యటించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
 
ప్రభుత్వ చర్యలు భేష్..
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం కేంద్ర బృందం నాయకుడు అశోక్‌కుమార్ మాట్లాడారు. ‘స్వైన్‌ఫ్లూ’ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు బాగుందని ప్రశంసించారు. వివిధ ఆసుపత్రులను సందర్శించినప్పుడు అక్కడి వైద్యసేవలు సంతృప్తినిచ్చాయని... కానీ పత్రికల్లో వచ్చిన కథనాలు తమకు షాక్ కలిగించాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధాని నుంచి ఏరియా ఆసుపత్రుల వరకు స్వైన్‌ఫ్లూ మందులను అందుబాటులోకి తేవడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.  

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్వైన్‌ఫ్లూ ప్రభావం ఉందని, చలికాలంలో ఇది ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడం మంచిదన్నారు. బాధితులకు ఉచిత చికిత్స చేయడంతో పాటు ఆరోగ్యశ్రీలో చేర్చడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం రాజయ్య, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా, కేంద్ర బృందం సభ్యులు శశిఖరే, మహేశ్, ప్రణయ్‌కుమార్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.
 
వైద్యులే రోగులను భయపెడితే ఎలా?
‘బాధితులకు భరోసా ఇవ్వాల్సిన వైద్యులే తమ ముఖానికి రెండేసి మాస్కులు ధరించి వారిని భయపెడితే ఎలా?’ అని మాస్కులతో తమకు ఎదురుపడిన ఒక వైద్యుడికి కేంద్ర వైద్య బృందం చురకంటించింది. సీఎంతో భేటీకి ముందు కేంద్ర వైద్య బృందం నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)ను, అనంతరం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిని సందర్శించింది. వైరస్ అంత ప్రమాదకరంగా ఏమీ లేదని, మాస్కులు ధరించి తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఫీవర్ ఆస్పత్రిలోని రెండు, మూడో వార్డులకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై కేంద్ర బృందం ఆరా తీసింది. ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయకుండా రోగులందరినీ ఒకే వార్డులో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో వెంటనే ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
 
గ్రేటర్‌లో 24 ప్రత్యేక బృందాలు
స్వైన్‌ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనంలో ఒక వైద్యుడితో పాటు ఇద్దరు నర్సులు, స్థానిక కమ్యూనిటీ హాల్ ఆర్గనైజర్‌ను నియమించారు. వీరంతా శనివారం ఉదయం నుంచి బస్తీల్లో పర్యటించి ‘స్వైన్‌ఫూ’్ల బారిన పడకుండా తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. అనుమానితులను ఆస్పత్రులకు తరలిస్తారు. ఈ మేరకు శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ గ్రేటర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫీవర్ ఆస్పత్రిలోనూ ‘స్వైన్‌ఫ్లూ’ పరీక్ష పరికరాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు