2 గంటలు.. క్షుణ్ణంగా

25 Oct, 2023 02:31 IST|Sakshi

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం

ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం రాక 

మహారాష్ట్ర వైపు కాలి నడకన వెళ్లిన అధికారులు 

బ్యారేజీ కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన 20వ పియర్‌ తనిఖీ 

15 నుంచి 22వ పియర్‌ వరకు, క్రస్ట్‌ గేట్ల పనితీరు పరిశీలన 

ఇరిగేషన్‌ అధికారులు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో చర్చలు 

అంతా గోప్యంగానే .. పోలీసు పహారాలో బ్యారేజీ ప్రాంతం 

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం మంగళవారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యుడు, అథారిటీ చైర్మన్‌ అనిల్‌జైన్, డైరెక్టర్లు కె.శర్మ, తంగమణి, రాహుల్‌ కె.సింగ్‌ తదితరులు స్థానిక అధికారులతో కలిసి మధ్యాహ్నం 12.10 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ పూర్తిగా పోలీసు దిగ్బంధంలో ఉంది. రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజీ పైకి ఎవరినీ అనుమతించడం లేదు.

ఈ నేపథ్యంలో కేంద్ర బృందం సభ్యులు కుంగిన బ్యారేజీని, రోడ్డును, బ్యారేజీలో పగుళ్లు ఏర్పడిన 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే బ్లాక్‌లోని 15 నుంచి 22వ పియర్‌ వరకు, క్రస్ట్‌ గేట్ల పనితీరును తనిఖీ చేసినట్లు తెలిసింది. బృందం సభ్యులు 20వ పియర్‌ దగ్గరి నుంచి మహారాష్ట్ర వైపునకు కాలినడకన వెళ్లారు. కొలతలు తీసుకున్నారు. దిగువకు దిగేందుకు ప్రయత్నం చేసినా తేనె తుట్టెలు ఉండడంతో ఆగిపోయినట్లు సమాచారం.

బ్యారేజీ వివరాలపై ఇరిగేషన్‌ అధికారులు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీ కొనసాగింది. కానీ ఒక్క ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీతో తప్ప ఇతర అధికారులెవరితోనూ వారు మాట్లాడలేదు. తమ వెంట రానివ్వలేదు. తమ పరిశీలనలో ఏం తేలిందో కూడా వారు వెల్లడించలేదు. కాగా బ్యారేజీ పరిస్థితి, ఇతర వివరాలతో తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి బృందం సభ్యులు సమర్పించన్నారు.

ఎల్‌అండ్‌టీ గెస్ట్‌హౌస్‌లో భోజనానంతరం ఈ బృందం అక్కడినుంచి వెనుదిరిగింది. కాగా బ్యారేజీ పరిస్థితి, సంబంధిత వివరాలను ఇరిగేషన్‌ శాఖ, ఎల్‌అండ్‌టీ సంస్థ గోప్యంగానే ఉంచుతున్నాయి. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన అధికారులను కూడా వద్దని నిలువరించినట్లు సమాచారం. కేంద్రం బృందం వెంట ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్‌ అండ్‌టీ ప్రతినిధులు, స్థానిక ఇరిగేషన్, పోలీసు అధికారులు ఉన్నారు.  

మళ్లీ కుంగిన వంతెన! 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ఈనెల 21న సాయంత్రం భారీ శబ్దంతో ఓ అడుగు మేర కుంగడం కలకలం రేపింది. తెలంగాణతో పాటు పక్కనున్న మహారాష్ట్ర వాసులు ఆందోళనకు గురయ్యారు. కాగా ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల్లో మళ్లీ కొంతమేర వంతెన, పియర్‌ కుంగినట్లు తెలిసింది. అర మీటరు లోతుకు కుంగినట్లు సమాచారం.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. 
బ్యారేజీ కుంగిన ఘటనపై మహదేవపూర్‌తో పాటు మహారాష్ట్రలోని పోలీసు స్టేషన్లలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ రవికాంత్‌ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో మహదేవపూర్‌ పోలీసులు 174/2023 యూ/ఎస్‌ ఐపీసీ 427, సెక్షన్‌ 3 పీడీపీసీ యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. 

జనం ఇబ్బందులు 
మేడిగడ్డ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి వరకు గోదావరిపై 1.6 కిలోమీటర్ల మేర బ్యారేజీని నిర్మించారు. ప్రస్తుతం వంతెన కొంత కుంగడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వారంతా కాళేశ్వరం మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. నిత్యం తెలంగాణ వైపు పత్తి, మిరప తోటలకు వచ్చే కూలీలు కూడా పని లేక ఇబ్బందులు పడుతున్నారు.  

రబీ పంటకు నీరెట్లా? 
మేడిగడ్డను ఖాళీ చేస్తుండటంతో రబీ పంటకు నీరెట్లా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మూడు రోజుల క్రితం వరకు బ్యారేజీలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన మహారాష్ట్ర ప్రాణహిత నది ద్వారా ప్రస్తుతం 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అయితే బ్యారేజీ 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిగా మరమ్మతులు చేసే వరకు ఇందులో నీటిని నిల్వ చేయడం వీలు కాదు. ఈ నేపథ్యంలోనే ఈసారి రబీ సీజన్‌లో ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు