టీఆర్‌ఎస్ వైపు యూసుఫ్ చూపు

27 Dec, 2014 01:37 IST|Sakshi
టీఆర్‌ఎస్ వైపు యూసుఫ్ చూపు

కామారెడ్డి : కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే సయ్యద్ యూసుఫ్‌అలీ తిరిగి క్రియాశీలకంగా పనిచేయడానికి ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకుగాను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరాలనే ఆలోచనతో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. కామారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ ఉద్దండుల్లో ఒకరైన మాజీ విప్ యూసుఫ్‌అలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. మండలి వ్యవస్థ ఆరంభంతోనే కామారెడ్డి ఎంపీపీగా, జడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

1994లో ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధపడగా టిక్కెట్ దక్కలేదు. అప్పుడు గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబుకు దగ్గరి మనిషిగా పేరున్న యూసుఫ్‌అలీకి రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి వరించింది. తరువాత 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా విప్ పదవితో సరిపెట్టుకోవలసి వచ్చింది.  2004లో ఎమ్మెల్యేగా తిరిగి పోటీకి సిద్ధపడగా, పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.

2009లో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించిన యూసుఫ్‌అలీ అనూహ్యంగా మహాకూటమి నుంచి టీఆర్‌ఎస్ ద్వారా జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు యూసుఫ్‌అలీ ఓడిపోగా, ఎమ్మెల్యేగా గోవర్ధన్ గెలుపొందారు. ఇద్దరికి మధ్య రాజకీయ విభేదాలు ఉండేవి. యూసుఫ్‌అలీ టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు. అయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఎమ్మెల్యే పదవికి గోవర్ధన్ రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో యూసుఫ్‌అలీ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు.

సొంత గూడు టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చే యకుండా ఉండిపోయారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా ఆయన టీఆర్‌ఎస్‌వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరడానికి రాష్ట్ర మంత్రులు కొందరిని యూసుఫ్‌అలీ సంప్రదించినట్టు సమాచారం.

అయితే తన చేరికను అడ్డుపడతాడని భావించిన యూసుఫ్‌అలీ స్థానిక ఎమ్మెల్యే, విప్ గోవర్ధన్‌తోనూ మాట్లాడినట్టు తెలిసింది. అయితే గోవర్ధన్ వైపు నుంచి సరైన స్పందన రాలేదని సమాచారం. టీడీపీలో ఉన్నపుడు ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవి కావు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని యూసుఫ్‌అలీ చేరికను గోవర్ధన్ సమర్థించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన యూసుఫ్‌అలీకి గతంలో ఆయనతో మంచి సంబంధాలే ఉండేవి. అదే ఉద్దేశంతో 2009 ఎన్నికల్లో మహాకూటమి బలపర్చిన అభ్యర్థిగా యూసుఫ్‌అలీ పేరును ఖరారు చేశారు. అప్పటికప్పుడు యూసుఫ్‌అలీకి గులాబీ కండువా కప్పి ఆయన్ను జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయించారు. అయితే గంప గోవర్ధన్ టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాత యూసుఫ్‌అలీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిపోయారు.

ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురితో యూసుఫ్‌అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. వారి ద్వారా టీఆర్‌ఎస్ లో చేరడానికి ప్రయత్నించినా, స్థానిక ఎమ్మెల్యే, విప్ గోవర్ధన్ నుంచి సానుకూలత రాకుంటే చేరడం సాధ్యం కాకపోవచ్చంటున్నారు.  ఏది ఏమైనా యూసుఫ్‌అలీ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు