పేదోడి భోజనానికి ఎసరు! | Sakshi
Sakshi News home page

పేదోడి భోజనానికి ఎసరు!

Published Sat, Dec 27 2014 1:35 AM

పేదోడి భోజనానికి ఎసరు!

 బహిరంగ మార్కెట్‌కు రేషన్ సరుకులు
 బియ్యం, పప్పుల నుంచి కిరోసిన్,
 వంటనూనెల దాకా అన్నీ నల్లబజారుకే
 ఆరు నెలల్లో పట్టుబడిన సబ్సిడీ సరుకుల విలువ రూ. 11.05 కోట్లు
 బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ. 40 కోట్లకు పైనే..
 పట్టుబడకుండా ఏటా తరలిపోతున్న సరుకుల విలువ రూ. 150 కోట్ల పైనే!

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి.. అక్రమాలకు అలవాటు పడ్డ డీలర్లు, అధికారులు వాటిని నల్లబజారుకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు.. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు.. రాష్ట్రంలో జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలల్లోనే నల్లబజారుకు తరలుతూ ఏకంగా రూ. 40 కోట్ల విలువైన సబ్సిడీ సరుకులు పట్టుబడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పేదలకు అందాల్సిన ఈ నిత్యావసరాలు ఇంకా ఇంతకు మూడు రెట్లకు పైనే.. అంటే దాదాపు రూ. 150 కోట్ల విలువైన సరుకులు బహిరంగ మార్కెట్‌కు తరలుతున్నట్లు అంచనా. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం ఏటా రూ. 1,800 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తూ నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తోంది. రూపాయికి కిలో బియ్యం చొప్పున, కిరోసిన్‌ను రూ. 15కు లీటర్ చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. వీటితో పాటు గోధుమలు, చక్కెర, కందిపప్పు వంటి పలు నిత్యావసర వస్తువులను కూడా సబ్సిడీపై పేదలకు ఇస్తున్నారు. కానీ పేదలకు అందాల్సిన ఈ సరుకులను డీలర్లు బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇది తెలిసినా... పలువురు అధికారులు తమ వాటా పుచ్చుకుని అక్రమాలకు సహకరిస్తున్నారు. ఇటీవల కాగ్ తన నివేదికలో సైతం ఈ అంశాన్ని ఎత్తిచూపింది. రేషన్ సరఫరా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, స్టాక్ రిజిష్టర్ల నిర్వహణలో డీలర్లు అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొంది. కానీ ప్రభుత్వంలో ఎటువంటి కదలికా లేకపోవడం గమనార్హం.
 
 ఎక్కువగా బియ్యమే..: ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న, నిల్వ చేసిన రూ. 11.05 కోట్ల విలువైన సబ్సిడీ సరుకులను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పట్టుకున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రేషన్ బియ్యం 8,653 క్వింటాళ్ల మేర ఉండగా... సూపర్ ఫైన్ రకం బియ్యం మరో 10 వేల క్వింటాళ్ల వరకు ఉంది. మార్కెట్ ధర ప్రకారం చూస్తే వీటి విలువ సుమారు రూ. 5.60 కోట్లు. ఇక అక్రమ మార్గాల్లో బహిరంగ మార్కెట్ తరలుతూ పట్టుబడని బియ్యం విలువ ఇంతకు మరో నాలుగు రెట్లు ఉంటుందనేది విజిలెన్స్ అంచనా. ఈ లెక్కన ఇప్పటివరకు సుమారు రూ. 20 కోట్ల విలువైన బియ్యం దారి మళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఆరు నెలల్లో విజిలెన్స్ 1.36 లక్షల లీటర్ల కిరోసిన్‌ను పట్టుకుంది. దీని అక్రమ మార్కెట్ విలువ ఏటా రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు ఉంటుందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సర్వేల ద్వారా తేల్చింది. వీటి తో పాటు అమ్మహస్తం పథకం కింద పంపిణీ చేస్తున్న గోధుమలు, గోధుమపిండి, కందిపప్పు సైతం పెద్దఎత్తున పట్టుబడుతునే ఉన్నాయి. ఇవన్నీగాక లెసైన్సులు లేకుండా అడ్డదారిలో విక్రయిస్తున్న బియ్యం, వంటనూనె, చక్కెర కలిపి రూ. 4 కోట్ల విలువైన సరుకు విజిలెన్స్ దాడుల్లో లభించింది.
 
 ఆర్నెల్లలో విజిలెన్స్ పట్టుకున్న సరుకులు..
 
 పీడీఎస్ బియ్యం        8,653.2 క్వింటాళ్లు
 సూపర్ ఫైన్ బియ్యం    10,510 క్వింటాళ్లు
 పప్పుధాన్యాలు        4,066 క్వింటాళ్లు
 ధాన్యం            2,3907.1 క్వింటాళ్లు
 చక్కెర            1,188.98 క్వింటాళ్ళు
 కిరోసిన్            1,36,378 లీటర్లు
 వంటనూనె        40,857 లీటర్లు
 గోధుమలు, గోధుమపిండి    200 క్వింటాళ్లు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement