ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలి

2 Jul, 2018 09:18 IST|Sakshi
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు 

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌ : బోగస్‌ వైద్య ధ్రువపత్రాలు సమర్పించి తప్పుడు పద్ధతుల్లో బదిలీ దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులపై తక్షణ చర్యలు చేపట్టాలనే కలెక్టర్‌ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట టీఎస్టీయూ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి మాట్లాడుతూ కౌన్సెలింగ్‌ ప్రక్రియను అపహాస్యం చేసేలా జిల్లాలో తప్పుడు వైద్య ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ దరఖాస్తులు చేసిన టీచర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 42 మంది నకిలీ వైద్య పత్రాలు సమర్పించారని తేల్చిన జిల్లా విద్యాశాధికారి కార్యాలయం టీఎస్‌టీయూ ప్రాతినిధ్యం మేరకు కలెక్టర్‌కు సమర్పించగా.. వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశించి వారం రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం సరికాదని అన్నారు.

2015 సంవత్సరంలో ప్రారంభమైన నకిలీ పత్రాల పరంపర 2018 బదిలీ వరకు వాటి సంఖ్య అనూహ్యంగా పెరగడానికి కారణం చర్యలుండవనే భరోసాతో ఉపాధ్యాయులు నకిలీ పత్రాలు సమర్పించడానికి వెనుకాడడం లేదన్నారు. అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవరకు టీఎస్‌టీయూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. డీఈవో కార్యాలయంలో బదిలీల దరఖాస్తులు పరిశీలన కోసం పని చేసిన టీచర్‌ తాను అంధున్ని అని దరఖాస్తు చేసుకోవడం, కరీంనగర్‌ మెడికల్‌ బోర్డులో నరాల సంబంధమైన డాక్టర్ల బృందం లేకున్నా ఆ వ్యాధుల సర్టిఫికెట్లు జారీ చేసిన విధానం చూస్తే ఎంత దిగజారుడు పద్ధతుల్లో పత్రాల జారీ జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు.

సర్వర్, సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో బదిలీల సందర్భంగా దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ఆప్షన్స్‌ ప్రాధాన్యక్రమం మారిపోయిందని, ఈ విషయంలో ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నాయకులు కంకణాల రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఎన్‌.కిరణ్‌కుమార్, గంగుల అంజిరెడ్డి, కటుకం అశోక్‌కుమార్, బండ నర్సింహారెడ్డి, గోపు శ్రీనివాస్‌రెడ్డి, మక్సూద్‌ అహ్మద్, రమణకుమార్, కృష్ణ, కె.సత్యనారాయణ, నారాయణరెడ్డి, దామోదర్, శ్రీనివాస్‌రెడ్డి, కోడూరి లక్ష్మిరాజం, నారాయణ, స్వరూపారాణి, మనోహర్‌రెడ్డి, గంగేశం తదితరులు పాల్గొన్నారు.

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి
న్యాయపరంగా ఉన్నవాటిని సవరించేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకుంటే నష్టపోయిన ఉపాధ్యాయులు కోర్టుకు పోక తప్పదని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కటుకం రమేశ్, ఎస్‌.ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 400 మంది ఉపాధ్యాయులు సవరణల కోసం దరఖాస్తు చేసుకున్నారని, న్యాయమైన వాటిని పరిష్కరించేందుకు ఎడిట్‌ ఆప్షన్లివ్వాలని డిమాండ్‌ చేశారు. స్పౌజ్‌ విషయంలో ఇప్పటికి గందరగోళం నెలకొందని, జీవో 16 మేరకే ఉపాధ్యాయ బదిలీలు జరగాలని అన్నారు. ఏకపక్షంగా ఆలోచించకుండా ప్రభుత్వం ఇకనైనా ఎడిట్‌ ఆప్షన్‌కు అవకాశం ఇస్తూ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరారు. 

మరిన్ని వార్తలు