గణేష్‌ ఉత్సవాల ఏర్పాట్లపై తలసాని సమీక్ష

23 Aug, 2019 20:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల నేపథ్యంలో మంత్రి తలసాని అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  నగరంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ప్రజా పతినిధులతో చర్చలు జరిపామని తెలిపారు. గణేష్ ఉత్సవ సమితితో పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాని,హైదరాబాద్‌లో 54 వేల వినాయక ప్రతిమలను పూజలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తారని అన్నారు.

గణేష్ ఉత్సవాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని, అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తరపున హుస్సేన్‌ సాగర్‌లో గంగ హారతి ఇస్తామని, హారతి ఎప్పుడనే అంశంపై పురోహితులను చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వ్యాఖ్యనించారు. నిమజ్జనం కోసం 26 చోట్ల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సోమవారం ఖైరతాబాద్ గణేష్ పనులను పరిశీలిస్తామని తెలిపారు.

సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సర్వ మతాలను గౌరవించే నగరమని, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నిమజ్జనానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. బందోబస్తు విషయంలో  రాజీ పడేది లేదన్నారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ముంబైలో గణేష్‌ ఉత్సవాలు గొప్పగా జరిగేవని, అయితే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పండుగ విజయవంతంగా జరిగేలా ప్రజలు,భక్తులు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రానున్న గణేష్ ఉత్సవాల పై అన్ని శాఖలతో సమావేశం నిర్వహించామని, మునుపెన్నడూ లేని విధంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని పండుగలను ఆదరిస్తూ చాలా గొప్పగా జరుపుతున్నారని కొనియాడారు. 
 

మరిన్ని వార్తలు