‘అడవి నుంచి పంపిస్తే పులులు ఓట్లేస్తాయా?’

7 Jun, 2017 19:40 IST|Sakshi
‘అడవి నుంచి పంపిస్తే పులులు ఓట్లేస్తాయా?’

ఖానాపూర్‌(మంచిర్యాల జిల్లా): టైగర్‌ జోన్‌ పేరిట అడవుల నుంచి గిరిజనులను పంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బుధవారం పోడు భూములు, భూ నిర్వాసితులు, వృత్తిదారుల సమస్యలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,600 ఎకరాల్లో పోడు భూములున్నాయని, వాటిని గిరిజనుల నుంచి లాక్కునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందన్నారు.

‘ఎన్నికలలో పులులు ఓట్లేస్తాయా.. గిరిజనులు ఓట్లేస్తారా’ అని ప్రశ్నించారు. గిరిజనులంతా ఏకమై పోరాటాలకు దిగాలని సూచించారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెబుతున్న పాలకులు భూములు పంపిణీ చేయడం పక్కన బెడితే ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరికీ భయపడకుండా భూములను దున్నాలని, ఎక్కడ ప్రజలు పోరాటం మొదలు పెడితే అక్కడికి ఎర్రజెండాతో వస్తామని అన్నారు. కులవృత్తిపై జీవించే మేదరులపై అటవీశాఖ అధికారుల వేధింపులు ఆపాలన్నారు.

మరిన్ని వార్తలు