-

ఆస్తిపన్ను అలర్ట్‌

18 Jun, 2019 12:15 IST|Sakshi

ఈ నెల 30లోపు  చెల్లించండి

జూలై 1 నుంచి 2 శాతం జరిమానా

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆస్తిపన్నును జరిమానా లేకుండా చెల్లించేందుకు కొద్ది గడువు మాత్రమే ఉన్నందున వెంటనే చెల్లిచాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూన్‌ 30లోగా చెల్లించని పక్షంలో వచ్చేనెల నుంచి 2 శాతం జరిమానా పడుతుందని హెచ్చరించారు. 

ఆస్తిపన్ను వసూలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, బోనాల పండగ ఏర్పాట్లు, కోర్టు కేసులు, టౌన్‌ప్లానింగ్‌ తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ విభాగాధిపతులతో సమావేశం, జోనల్, డిప్యూటి కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను 14,50,000 మంది  జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 6,77,119 మంది రూ. 592 కోట్లను చెల్లించారని తెలిపారు. ఆస్తిపన్ను వసూళ్లపై  ప్రత్యేక శ్రద్ధ చూపించాలని డిప్యూటి కమిషనర్లకు సూచించారు. నగరంలో స్వచ్ఛ కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్న, 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించే, ఉపయోగించేవారికి జరిమానాలను విధించాలని సూచించారు.

సంపూర్ణ స్వచ్ఛత సాధనకై చేపట్టిన ‘సాఫ్‌ హైదరాబాద్‌ – షాన్‌దార్‌ హైదరాబాద్‌’ కార్యక్రమం మున్సిపల్‌ పరిపాలనలో వినూత్నమని, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలయ్యేలా డిప్యూటి, జోనల్‌ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. సాఫ్, షాన్‌దార్‌ హైదరాబాద్‌ నిర్వహణ పై త్వరలోనే నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరుగనుందని, ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ఏరియా, వార్డు కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. నగరంలో నీటి వృథా అరికట్టడం, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణపై గుర్తించిన వాలంటీర్లకు  జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు  తెలిపారు. జీహెచ్‌ఎంసీలో పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా కేసులన్నింటికి కౌంటర్లను దాఖలు చేయడంతో పాటు ఈ కోర్టుకేసులపై ప్రతివారం సమీక్షించాలని డిప్యూటి, జోనల్‌ కమిషనర్లకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు హరిచందన, అద్వైత్‌కుమార్‌ సింగ్, శృతిఓజా, సందీప్‌జా, సిక్తాపట్నాయక్, జయరాజ్‌ కెనెడి,  కృష్ణ, చీఫ్‌ ఇంజనీర్లు సురేష్, జియాఉద్దీన్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు